ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో వేసిన ప్రశ్న ఏంటనేదాని కంటే, ముందుగా ఒక చిన్న టాపిక్ మాట్లాడుకోవాలి. కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది, దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం చంద్రబాబు తమదో దోస్తీ కటీఫ్ చేసుకున్నారని భాజపా నేతలు విమర్శిస్తున్నారు. ఏదేమైనా.. ఇది కేంద్రంపై టీడీపీ చేస్తున్న పోరాటం అనే కదా ఎవరైనా అంటారు! దేశవ్యాప్తంగా అందరూ ఇలానే అనుకుంటున్నారు కదా. ఇంకాస్త వెనక్కి వెళ్తే, గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర క్యాబినెట్ నుంచి ఆంధ్రా మంత్రులు బయటకి రావడం, ఎన్డీయేతో ఏపీ అధికార పార్టీ తెగతెంపులు చేసుకోవడం… దీన్ని కూడా పోరాటమనే అన్నారు!
ఇప్పుడు జగన్ ట్వీట్ విషయానికొస్తే… ‘చంద్రబాబు గారూ… మీ నలభయ్యేళ్ల రాజకీయ జీవితంలో ఒక పోరాటంగానీ, ఒక ఉద్యమంగానీ ఎప్పుడైనా చేశారా’ అంటూ జగన్ సూటిగా ప్రశ్నించారు. అంటే, ఆంధ్రా ప్రయోజనాల కోసం ఎవ్వరూ పోరాడటం లేదనీ, తాము మాత్రమే పోరాడుతున్నామని చెప్పుకోవడమే ఈ ట్వీట్ ఆంతర్యం. ఇక, ఈ ట్వీట్ కి రిప్లైలు కూడా కొన్ని ఘాటుగా ఉంటున్నాయి. ‘పోరాటమంటే శుక్రవారం కోర్టులో చేసేది.. అదేగా, అయితే అది ఆయన చెయ్యలేదు’ అంటూ కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఇంతకీ… జగన్ దృష్టిలో పోరాటం అంటే ఏంటనేదే ప్రశ్న. నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక హోదాపై పోరాటం చేసి అలిసిపోయామని చెప్పుకుంటారు, కానీ ఎక్కడుందా పోరాటం..? కొన్ని దీక్షలు, కొంత హడావుడి మినహా… కేంద్రాన్ని ఇసుమంతైనా ప్రభావితం చేయగలిగిందా పోరాటం..? ప్రజాస్వామ్యంలో పోరాటాలంటే… ఫలితాలను రాబట్టగలిగేవి మాత్రమే. ఐదుగురు ఎంపీలతో రాజీనామాలు చేయించి, అదే త్యాగమన్నారు. ఆ తరువాత ధర్నా అంటూ ఢిల్లీలో కొన్నాళ్లు కూర్చున్నారు. కానీ, కేంద్రం స్పందించిందా, ప్రధాని మాట్లాడారా..? పార్లమెంటులో చర్చ జరిగిందా..?
నాయకులు చట్టసభల్లో ఉంటేనే ఏ పోరాటమైనా కాస్తైనా ప్రభావవంతంగా ఉంటుంది. చట్ట సభలకు వెళ్లాలన్న కనీస కర్తవ్యాన్ని వదిలేయడమేనా వైకాపా పోరాటమంటే..? ఏపీలో సమస్యలున్నాయి, కానీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోవడమేనా పోరాటమంటే..? వైకాపా దృష్టిలో ఆంధ్రా ప్రయోజనాలంటే కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలుగా మారిపోయాయి! అందుకే, వచ్చే ఎన్నికల్లో హోదాకి ఎవరు మద్దతు ఇస్తే.. వారితోనే పొత్తు అనే లెక్కల వరకూ వెళ్లిపోయారు. అంతేగానీ, ఎన్నికలు జరిగేలోగా కూడా కేంద్రంపై పోరాటం చేస్తే ఏదైనా సాధించొచ్చు అనే అంశాన్ని వదిలేస్తున్నారు. వాస్తవం మాట్లాడుకుంటే… రాష్ట్రస్థాయిలో టీడీపీని వ్యతిరేకించడమే వైకాపా అజెండా, రాజకీయంగా అది పెద్దగా తప్పుపట్టాల్సిన అంశమూ కాదు. కానీ, జాతీయ స్థాయికి వచ్చేసరికి తెలుగువారి ప్రయోజనాల కోసం ఐకమత్యంగా కదలాలన్న స్ఫూర్తి వైకాపాలో లేదు. అదే ఉంటే కేంద్రం స్పందన మరోలా ఉండేది! మరి..ఇదేనా పోరాటమంటే? వారు చేసిన కొన్ని ధర్నాలు, నిరసన కార్యక్రమాలనే పోరాటాలనే పోరాటాలుగా చెప్పుకుంటే ఎలా..?