‘సాక్ష్యం’ సెన్సార్ ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జంతువులు, పక్షులకు సంబంధించిన కొన్ని షాట్స్ ఉన్నాయి. సెన్సార్ నిబంధనల ప్రకారం… సినిమాల్లో వాటిని చూపించాలంటే కొన్ని ప్రత్యేక అనుమతులు రావాలి. అది లేకపోతే… సెన్సార్ చేయరు. చేసినా సర్టిఫికెట్ ఇవ్వరు. దాంతో ఈనెల 27న విడుదల కావాల్సిన సాక్ష్యం చిక్కుల్లో పడింది. ఈనెల 27న ఈ సినిమా వస్తుందా, రాదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే…. చిత్రబృందం క్లియరెన్స్ సర్టిఫికెట్ ని సంపాదించడానికి యుద్ధప్రాతిపదికపై సన్నాహాలు చేసేస్తోంది. డిల్లీ నుంచి చాలా హై రికమెండేషన్పై ఈ సర్టిఫికెట్ తీసుకురావడానికి కసరత్తులు చేస్తున్నారు. బుధ, గురు వారాల్లో ఈసర్టిఫికెట్ చేతికి అందుతుందని సమాచారం. మంగళవారం ‘సాక్ష్యం’ సెన్సార్ జరగబోతోంది. సెన్సార్ జరిగినా సర్టిఫికెట్ మాత్రం ఇవ్వరు. క్లియరెన్స్ సర్టిఫికెట్ చేతికి అందిన తరవాతే… సెన్సార్ సర్టిఫికెట్ విడుదల చేస్తారు. ఒకవేళ ఈ క్లియరెన్సులు దక్కడం అటూ ఇటూ అయితే ఈ చిత్రాన్ని ఈనెల 28కి వాయిదా వేయాలని చిత్రబృందం భావిస్తోంది. 27 తప్పితే.. 28 రావడం ఖాయమని చిత్రబృందం గట్టిగా చెబుతోంది. మొత్తానికి ఈ వారమే ‘సాక్ష్యం’ రావడం ఖాయంగా కనిపిస్తోంది.