రాజ్యసభలో విభజన చట్టాన్ని అత్యంత గందగరోళ పరిస్థితుల మధ్య ఆమోదిస్తున్న సమయంలో… ఏపీ తరపున వకాల్తా పుచ్చుకున్న వెంకయ్యనాయుడు.. ప్రత్యేకహోదా విషయంలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఐదేళ్లు కాదు..పదేళ్లు కావాలని… రెండు చేతుల వెళ్లను చూపిస్తూ హంగామా చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మేము వచ్చాక పదేళ్లు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని… వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఊరూరా సన్మానాలు చేయించుకున్నారు. ఈ సన్మానాలతో తీరిక లేక ఆయన కార్లోనే చొక్కారు కూడా మార్చుకున్నారని చెబుతారు. ఆ ప్రత్యేకహోదా ఇంకా రాలేదు.
ప్రత్యేకహోదా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని వెంకయ్యనాయుడితో ఏపీపై ఒత్తిడి చేయించి కేంద్రం అంగీకరింపచేసింది. ప్యాకేజీ ప్రకటించగానే మళ్లీ వెంకయ్యనాయుడు.. వారాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోదిగిపోయేవారు. ఉదయం ఒక సన్మానం..సాయంత్రం ఒక సన్మానం చేయించుకునేవారు. ఆ సన్మానాల వేడి తగ్గేసరికే… ఆ ప్యాకేజీకి కూడా కేంద్రం జెల్లకొట్టేసింది. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోయారు. అంటే.. ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ రాలేదు కానీ.. అవి ఇప్పించినట్లు సన్మానాలు చేయించుకున్న వెంకయ్యనాయుడికి మాత్రం ఓ హోదా వచ్చింది.
ఇప్పుడు ఆ హోదాలోనే ఆయన.. ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న ఆందోళనలను .. గోలగా తేల్చి పారేశారు వెంకయ్య. ఉపరాష్ట్రపతిగా రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వెంకయ్యనాయుడు.. వెల్‌లో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. గోల చేస్తున్నారని.. టీవీల్లో కనిపించేందుకు డ్రామాలకోసమేనన్నట్లు మండిపడ్డారు. కాసేపు రాజ్యసభ టీవీ ప్రసారాలను నిలిపి వేసి.. ఇక మీ డ్రామాలు ఎవరూ చూడడం లేదని వెటాకారాలు ఆడారు. దీంతో నిశ్చేష్టులవ్వాల్సిన పరిస్థితి టీడీపీ ఎంపీలది. అచ్చంగా మోడీ ఇంత కాలం చేశాడో.. కచ్చితంగా రాజ్యసభలో వెంకయ్యనాయుడు కూడా అదే చేశారని ఎంపీలు ఆవేదన చెందారు.
అసలు ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా… వెంకయ్యనాయుడు ఎందుకు కామ్‌గా ఉంటున్నారన్నదానిపై ఇప్పటికే ప్రజల్లో చర్చ జరుగుతోంది. వెంకయ్య పదవికి రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేస్తే..కచ్చింతగా… మోడీ దిగి వస్తాడని అంటున్నారు. ఎందుకంటే.. వెంకయ్యనాయుడుకు బీజేపీలో అంత పలుకుబడి ఉంది. ఆరెస్సెస్ మద్దతు కూడా ఉంది. కానీ వెంకయ్య మాత్రం.. తాను చెప్పిన మాటల్నీ మోడీ వమ్ము చేస్తున్నా.. పార్టీని మాత్రం ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. సొంత రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు.