ఈ మధ్యనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆంధ్రాకి వచ్చారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించి, దాన్ని పూర్తి చేసే బాధ్యత తమదనీ, నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులను పరుగులు తీయించిన ఘనత నరేంద్ర మోడీ సర్కారుది అని ప్రచారం చేయాలంటూ కార్యకర్తలకూ దిశానిర్దేశం చేశారు. ఈ మాట పుచ్చుకుని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ… ఇంతకీ చంద్రబాబుకు పోలవరంపై ఉన్న హక్కేంటనీ, ఆయనకేంటి సంబంధం అంటూ విమర్శించేశారు. అయితే, తాజా పార్లమెంటు సమావేశాల సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అంశం రాజ్యసభలో సోమవారం చర్చకు వచ్చింది. దీనిపై కేంద్రం వాదన ఇప్పుడు ఇంకోలా వినిపిస్తోంది.
సరైన బిల్లులు, నివేదికలు ఉంటే తప్ప పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులు విడుదలయ్యే అవకాశం లేనట్టుగా మరోసారి కొర్రీలు పెట్టేందుకు సిద్ధమౌతోంది. ప్రాజెక్టు అంచనాలు రూ. 16 వేల కోట్ల నుంచి రూ. 58 వేల కోట్లకు ఎలా పెంచేశారంటూ కేంద్రం ఇప్పుడు ఆశ్చర్యం వక్తం చేయడం గమనార్హం! దీన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలిస్తోందనీ, దీనిపై మరింత స్పష్టమైన సమాచారం తెప్పించుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాదు, పోలవరం విషయమై ఆంధ్రా సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయనీ, భూసేకరణతోపాటు పునరావాసం, కాలువల డిజైన్ల మార్పులు వంటివి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉండాలనే వాదనను వినిపించే ప్రయత్నం చేసింది.
దీంతో, పోలవరం విషయమై ఏవైనా కొత్త కొర్రీలు పెట్టేందుకు భాజపా సిద్ధమౌతుందేమో అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ప్రాజెక్టు అంశమై ఏదో ఒక పాయింట్ అందిపుచ్చుకుని టీడీపీ సర్కారును తప్పుబట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు గతంలోనూ కథనాలు వచ్చాయి. అయితే, నితిన్ గట్కరీ పోలవరం సందర్శనకు రావడంతో, ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతాయనే అనిపించింది. కానీ, ప్రస్తుతం రాజ్యసభలో పరిస్థితి చూస్తే, ప్రభుత్వం నుంచి ఇలాంటి సంకేతాలు వస్తున్నాయి. ఓపక్క, ఏపీ భాజపా నేతలేమో… పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిందేం లేదనీ, అంతా తామే చేశామని విమర్శిస్తుంటారు. పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయంటారు. కేంద్రం మాత్రం.. ఇప్పుడు కొత్తగా పరిశీలించాలీ, విశ్లేషించాలంటూ అంటూ చెబుతున్నారు.
ఇలాంటి చర్చలు ఏపీ భాజపా నేతలకు ఏమాత్రం వినిపించవు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిపోయింది అంటూ విమర్శలే తప్ప… పనులు ముందుకు సాగకుండా కేంద్రమే ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంకిని సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై స్పందించరు.