మంగళవారం రాష్ట్ర బంద్ కి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇతర పార్టీలు కూడా తమకు మద్దతు ఇవ్వాలంటూ జగన్ కోరారు. అయితే, ఇదే అంశమై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా స్పందించారు. బంద్ లను తాము సమర్థించేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే, దాన్లో పాల్గొనడం మానేసి రాష్ట్రంలో నిరసనలు తెలిపితే ఏం ఉపయోగమంటూ ప్రశ్నించారు. దాదాపు ఇలాంటి అభిప్రాయమే రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రాలో నియోజక వర్గాలు పర్యటిస్తున్నారు. గత ఎన్నికల తరువాత తటస్థంగా ఉన్న పాత కాంగ్రెస్ నేతల్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చారు. ఈ క్రమంలో మరికొన్ని కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
అయితే, ఆంధ్రా కాంగ్రెస్ యాక్టివేట్ అవుతూ ఉండటంతో వైకాపా వర్గాల్లో కొంత చర్చ మొదలైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి, వచ్చే ఎన్నికల్లోపు ఏపీలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకునే పరిస్థితులు లేవు. కాకపోతే, ఏమాత్రం ప్రభావం చూపినా చాలు, ఆ మేరకు నష్టపోయేది వైకాపా అనడంలో సందేహం లేదు! ఎందుకంటే, వైకాపాకి ఉన్న ఓటు బ్యాంకు అంతా కాంగ్రెస్ నుంచి వచ్చిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత వైకాపాకి కలిసొచ్చింది. ఇదే విషయమై తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో కూడా పార్టీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో మరోసారి ప్రస్థావనకు వచ్చినట్టు తెలుస్తోంది. నియోజక వర్గాలవారీగా గతంలో కాంగ్రెస్ కి ఉన్న ఓటు బ్యాంకును వెనక్కి రప్పించే కసరత్తు చేయాలంటూ పార్టీ హైకమండ్ స్పష్టంగా దిశానిర్దేశం చేసిందట.
దీంతో వైకాపాలో సహజంగానే కొంత గుబులు ప్రారంభమౌతుంది. కిరణ్ కుమార్ రెడ్డి తరువాత మరికొద్దిమంది పాత నేతలు వెనక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తరఫున సీట్లు దక్కించుకునేందుకు కూడా కొంతమంది సిద్ధమౌతారు. ఎలాగూ, ఏపీ విషయంలో భాజపా కంటే కాంగ్రెస్ కాస్త నయమేమో అనే అభిప్రాయం మెల్లగా ఏపీలోనూ ఏర్పడుతోంది. దానికి అనుగుణంగానే హైకమాండ్ కూడా ఆంధ్రా ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామంటూ తాజా తీర్మానాలు ఉంటున్నాయి. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కొంతమంది అభ్యర్థులు బరిలోకి దిగే ఛాన్సులున్నాయి. సరే, వారు గెలుస్తారా ఓడుతారా అనే చర్చ పక్కన పెడితే… పోటీకి దిగిన అభ్యర్థులు కొన్నైనా ఓట్లు దక్కించుకుంటారు కదా! ఆ కొన్నీ వైకాపా నుంచి చీలినవే అవుతాయి కదా! ఆ రకంగా ఏపీలో బలోపేతమయ్యేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నుంచి వైకాపా ఓటు బ్యాంకుకు గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి.