దేశంలో ఇప్పుడు ఎన్నికల వేడి పెరుగిపోతోంది. 2019 ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే.. రాజకీయ పార్టీల మధ్య పొత్తుల గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. మిత్రపక్షాల విషయంలో బీజేపీ… నిర్లక్ష్యం కారణంగా.. ఆ పార్టీని వదిలి వెళ్లిపోతున్న పార్టీలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా… కలసి పోరాడేందుకు ఇతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఈ పార్టీలన్నీ 2019 ఎన్నికల కోసం మహాకూటమిగా ఏర్పడతాయా అన్న చర్చ దేశ రాజకీయాల్లో నడుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 2019 ఎన్నికలకు ముందు భారతీయజనతా పార్టీని ఎదుర్కోవడానికి.. మహాకూటమి ఏర్పడటం అసాధ్యం. అవసరం కూడా లేదు.
మహాకూటమి ఎందుకు సాధ్యం కాదు..?
ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ..కాంగ్రెస్ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధంగా లేవు. వాటికి ఆ అవసరం కూడా లేదు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్, మాయవతి, బెంగల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే.. చంద్రబాబు.. వీరెవరికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు ఉనికి లేదు. కొన్ని రాష్ట్రాల్లో నామ మాత్రంగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో… కాంగ్రెస్ నాయకత్వంలో… జాతీయ ఎన్నికలను ఎదుర్కోవడం.. ఆయా పార్టీలకు నష్టం. అందుకే ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేవు. ఎన్నికల తర్వాత.. రాజకీయం ఢిల్లీ చేరిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీల మద్దతుతో కానీ… ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ మద్దుతుతో కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బీజేపీ, బీజేపీ మిత్రులకు మెజార్టీ రానప్పుడు.. కాంగ్రెస్కు మెరుగైన స్థానాలు వచ్చినప్పుడు ఇది సాధ్యమవుతుంది.
కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రాంతీయ పార్టీలు అంగీకరించవు..!
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూటమి ఏర్పడుతందనుకోవడం పగటి కలే. అలా కాకుండా… కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వలోనే ఫ్రంట్ ఏర్పడాలి.. ఆ ఫ్రంట్ ఎన్డీఏతో పోరాడుతుందని.. పట్టుబడితే కాంగ్రెస్కు వినాశకర పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ఉదాహరణ.. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్, పుల్పూర్ ఉపఎన్నికలు . ఈ రెండు చోట్లా… ఎస్పీ, బీఎస్పీ కలసి పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ మేము మద్దతివ్వబోమని పోటీకి దిగింది. కానీ ఆ పార్టీకి డిపాజిట్లు రాలేదు. అంటే.. కాంగ్రెస్ లేకపోయినా.. ఎస్పీ, బీఎస్పీలు కలసి పోటీ చేస్తే విజయం సాధించగలవు. దీని నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకుంది. తమ నాయకత్వంలోనే మీరంతా రావాలి అంటే.. వీరెవరూ సిద్ధంగా లేరు. వాళ్లను కలుపుకోకపోతే.. నష్టపోయేది వాళ్లు కాదు.. కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ దీన్ని గుర్తించించింది. కాబట్టే కైరానా ఉపఎన్నికలో ఆర్ఎల్డీకు మద్దతిచ్చింది. ఈ వ్యూహాన్ని దేశం మొత్తం అమలు చేయాలి. ఎన్నికల ముందు కూటమి సాధ్యం కాదు. అలా కాకుండా.. తమ నేతృత్వంలోనే కూటమి ఉండాలంటే వినాశకర పరిణామాలే కాంగ్రెస్కు వస్తాయి.
ప్రస్తు పరిస్థితుల్లో మహాకూటమి అవసరం లేదు.. !
బీజేపీ వ్యతిరేకత శక్తులు ఏకమవుతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్లో తృణమల్ వ్యతిరేకిస్తోంది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఇలా వివిధ రాష్ట్రాల్లో బీజేపీతో వివిధ పార్టీలు తలపడుతున్నాయి. కూటమి కట్టడంలో ఓ రాష్ట్రంలో మరో పార్టీ పోటీ చేయడానికి అవకాశం ఉండదు. పోటీ చేసినా ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు. అందువల్ల తమ తమ రాష్ట్రాల్లో సంబంధం లేని కూటమి కట్టాల్సిన అవసరం లేదు.
బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలి..!
కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు కూటమి కట్టకపోయినా.. అవగాహనతో వ్యవహరించాలి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా.. చూసుకోవాలి. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ విడివిడిగా పోటీ చేశాయి. తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కలసి పోటీ చేశాయి. ముందుగానే ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేసి ఉంటే.. 70 నుంచి 80 శాతం సీట్లు గెల్చుకుని ఉండేవారు. ఉత్తరప్రదేశ్లో… ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ మూడు పార్టీలు గెలిస్తే.. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు బీజేపీకి ఉన్న పార్లమెంట్ సీట్లలో మెజార్టీ సీట్లలో ఓడించవచ్చు. మహా వస్తే ఇరవై సీట్లు బీజేపీకి వస్తాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లోనే చూసుకుంటేనే… 70 సీట్లు బీజేపీకి కోత పడుతోంది. అన్ని చోట్ల ఇలాగే.. బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా.. జాగ్రత్త పడితే… బీజేపీని ఢిల్లీలో ఆటోమేటిక్గా ఓడించవచ్చు.