వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కనీస మాత్రం లేకపోవడం రాజకీయవర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. వామపక్షాలు, జనసేన, ఇతర ప్రజాసంఘాలు కూడా దూరంగా ఉన్నప్పటికీ.. వైసీపీ శ్రేణులు బంద్‌లో పాల్గొన్నా.. ఓ మాదిరి ప్రభావం అయినా కనిపించేది. కానీ అది కూడా లేదు. వైసీపీ ముఖ్యనేతలతో పాటు ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా.. బంద్‌ను పట్టించుకోలేదు. వైసీపీ సానుభూతి పరులుగా పేరున్న వారు కూడా.. ఎక్కడా తమ తమ దుకాణాలను కూడా మూసివేయలేదు. బంద్ పరువు తీసే పరిస్థితి ఏర్పడటంతో.. జగన్ మధ్యాహ్నం జిల్లాల నేతలకు ఫోన్లు చేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
బంద్ విఫలమవడానికి జగనే కారణమని.. వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. బంద్ లాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు.. సొంత పార్టీ నేతలతో ఒక్కసారి అయినా చర్చించి.. ఎలా విజయవంతం చేయాలో వ్యూహం సిద్ధం చేసుకోవడం నాయకుల లక్షణమని..జగన్ అలాంటి ఆలోచన చేయరని అంటున్నారు. పార్టీ అధ్యక్షునిగా నిర్ణయం తీసుకుని మీడియా ద్వారా ప్రకటించిన తర్వాతే నేతలకు బంద్ అనే సంగతి తెలుస్తోంది. అదే సమయంలో ఇతర పార్టీల నేతల్ని కూడా.. కలుపుకునే ప్రయత్నం చేయలేదు. తాను బంద్‌కు పిలుపునిస్తే..సొంత పార్టీ నేతలు చచ్చినట్లు ఫాలో అవుతారు కాబట్టి.. వారిలాగే ఇతర పక్షాలు కూడా కలసి వస్తాయనుకున్నారు. కానీ ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదు. పార్టీ ముఖ్యనేతల్ని ఆయా పార్టీల వద్దకు పంపినా బంద్ కు మద్దతు దొరకలేదు.
బంద్ ప్రభావం ఏ మాత్రం లేకపోవడంతో.. వైసీపీ బలంపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ ఎంతో కొంత బలంగా ఉందనుకుంటున్నారు. కానీ బంద్ లో ఎక్కడా ఆ బలం చూపించలేకపోయారు. మామూలుగా బస్సులు ఆపేవారిని, రాస్తారోకోలు చేసేవారిని పోలీసులు ఆరు గంటలకల్లా అదుపులోకి తీసుకుంటారు. బంద్ లోనూ అలాగేనే చేశారు. తప్పనిసరిగా బంద్‌లో పాల్గొన్నవారు.. పోలీసులు రాగానే వారితో వెళ్లిపోయారు. పరిస్థితిని వెంటనే అర్థమైపోవడంతో… వైసీపీ నేతలు. వెంటనే.. ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందనే ప్రచారం ప్రారంభించారు. జగన్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు .. పార్టీకి మైనస్ అవుతున్నాయన్న విషయాన్ని పార్టీ అంతర్గత సమావేశాల్లో లేవనెత్తాలన్న ఆలోచనల్లో కొంత మంది ముఖ్య నేతలున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ అనుభవాన్ని చూసైనా.. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ ను డిమాండ్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.