రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నర్సింహారావు వీరావేశంతో తొలిసారిగా ప్రసంగించారు. భాజపాపై ఉన్న స్వామి భక్తి విశ్వరూపం ప్రదర్శించారు. తాను ఆంధ్రుడనే, తన రాష్ట్రానికి కేంద్రం మేలు చేస్తుంటే పులకించిపోయానంటూ ఈ మధ్యనే జీవీఎల్ చేసిన ప్రకటన ఒక్కసారిగా ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే, తాజాగా రాజ్యసభలో ఆయన మాట్లాడిన మాటల్లో… పొరపాటున కూడా ఆ ఛాయలు కనించలేదు. ఏపీ పక్షపాతిగా మాట్లాడతారని ఎవ్వరూ అనుకోదుగానీ, మరీ ఇంత విద్వేషాన్ని వెళ్లగక్కుతారని మాత్రం భావించలేదు. భాజపా ఆవహించినట్టు చెలరేగిపోయారు! ఆయన ప్రసంగిస్తున్న సమయంలో… ఒక దశలో ఇది సీఎం చంద్రబాబు నాయుడు మీద పెట్టిన అవిశ్వాస చర్చా అనే అనుమానం కూడా చాలామందికి కలిగింది! అంతేకాదు, ఈయనకంటే రాజనాథ్ సింగ్ ప్రసంగమే తెలుగువారికి కాస్త ఊరట కలిగించే విధంగా ఉందనిపించింది.
ఈస్ట్రన్ కారిడార్ లో కోటీ పది లక్షలు ఉద్యోగాలు వస్తాయని జీవీఎల్ చెప్పేసరికి… సభలో అందరూ గొల్లుమని నవ్వారు. మరి, అవి ప్రశంసల్లా వినిపించాయేమో ఆయనకి.. మళ్లీ మళ్లీ అదే మాట చెప్పడం హాస్యాస్పదం. కేంద్రం ఎంతో సాయం చేసిందని గతంలో ఆంధ్రా ప్రభుత్వం ఒప్పుకుని, అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. వరుసగా పత్రాలు తీస్తూ లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. ఓవరాల్ గా ఆయన పాయింట్ ఏంటంటే… కేంద్రం ఆంధ్రాకి చాలా చేసేసింది, ఇప్పుడు టీడీపీ కావాలనే భాజపాపై బురదచల్లుతోంది, అంతే!
ఇంతకీ, ఈ మధ్య కాలంలో జీవీఎల్ కేవలం ఏపీ అంశాలపై మాత్రమే ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నారు? గతంలో జాతీయ స్థాయి ఇష్యూస్ పై స్పందించేవారు. గడచిన ఓ నెలా పదిహేను రోజులుగా ఢిల్లీలో కూర్చుని, టార్గెట్ ఏపీ అన్నట్టుగా ఎందుకు విమర్శలు చేస్తున్నారు..? ఈ ప్రశ్నలకు సమాధానం… ‘ఆయన్ని అదే పనిలో ఉండమని అమిత్ షా చెప్పారు కాబట్టి’ అని వినిపిస్తోంది! ఏపీలో భాజపాకి వచ్చేదీ లేదూ పోయేదీ లేదు. కాబట్టి, ఆ రాష్ట్రాన్ని ఉపేక్షించొద్దని జీవీఎల్ కి మౌఖిక ఆదేశాలు అమిత్ షా ఇచ్చారట..! అంతేకాదు, ఏపీ టీడీపీ నేతలు భాజపాపై ఎలాంటి కామెంట్లు చేస్తున్నారనేది రోజూ హిందీ లేదా ఇంగ్లిష్ లో ట్రాన్సిలేట్ చేసి వినిపించే బాధ్యత కూడా ఈయనేదట. ఏపీకి సంబంధించి నువ్వే చొరవగా మాట్లాడాలని షా భుజం తట్టడంతోనే ఈయన రోజుకి రెండు ప్రెస్ మీట్లు ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారనే టాక్ ఢిల్లీ భాజపా వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎంత విచిత్రమంటే… ఆంధ్రా ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం తరఫున ఆంధ్రా మూలాలున్న నాయకుడితోనే భాజపా మాట్లాడిస్తూ ఉండటం.