ప్రత్యేకహోదా ఏ రాష్ట్రానికీ లేదని.. పార్లమెంట్ వేదికగా నిరూపించాలనుకున్న ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికయిన స్వయం ప్రకటిత “తెలుగుబిడ్డ” జీవీఎల్ నరసింహారావుకు సొంత ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలేమిటి.. వాటికి కల్పిస్తున్న ప్రయోజనాలేమిటనేది.. అని అర్థం వచ్చేలా రాజ్యసభలో ఆయన ఓ ప్రశ్న వేశారు. దానికి లిఖిత పూర్వక సమాధానం కేంద్రం నుంచి వచ్చింది. అందులో ప్రత్యేకహోదాను రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతుందనుకున్నారు. కానీ కేంద్రం అలా చెప్పలేదు. పదకొండు రాష్ట్రాలు ప్రత్యేకహోదా ప్రయోజాలు పొందుతున్నాయని స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల, మూడు హిమాలయ రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
తను వేసిన ప్రశ్నను.. దానికి వచ్చిన సమాధానాన్ని వివరించేందుకు మీడియా ముందుకు వచ్చిన జీవీఎల్.. సొంత భాష్యం చెప్పి… కొత్త రాజకీయం చేద్దామని ప్రయత్నించారు. కానీ ఒక్క దానికి సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో 90 శాతం నిధులు గ్రాంట్ గా లభిస్తాయని జీవీఎల్ చెప్పుకొచ్చారు. అంతే తప్ప.. పారిశ్రామిక రాయితీలు ఉండవన్నారు. కానీ కేంద్రం పారిశ్రామిక రాయితీల గురించి చెప్పలేదు. అదే సమయంలో ప్రత్యేకహోదా ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రాల్లో ఇప్పుడు ఏపీ కూడా ఉందని చెప్పుకొచ్చారు. కానీ నిధులు తీసుకోవడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం అమలు కావడం లేదన్నారు. మరి… ప్రత్యేకహోదా ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రాలన్నీ.. ఎస్పీవీలు పెట్టుకున్నాయా అంటే… దానికి జీవీఎల్ దగ్గర సమాధానం లేదు. ఆయా రాష్ట్రాలకు… ఎస్పీవీ లేనప్పుడు.. ఏపీకి మాత్రమే ఎందుకన్న ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేకపోయారు.
ఇక సీఎం రమేష్ చేసిన సవాల్ పై కూడా..జీవీఎల్ నరసింహారావు నలుక మడతేశారు. పధ్నాలుగో ఆర్థిక సంఘం… ప్రత్యేకహోదా ఇవ్వవద్దని… సిఫార్సు చేసి ఉంటే.. దాన్ని చూపిస్తే.. తను తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సీఎం రమేష్ సభలోనే ప్రకటించారు. సీఎం రమేష్ ఆర్థిక సంఘం సిఫార్సులను సరిగ్గా అర్థం చేసుకోలేదని కవర్ చేసుకున్నారు. మూర్ఖంగా మాట్లాడేవారికి సమాధానం చెప్పలేమని వెళ్లిపోయారు. మొత్తానికి జీవీఎల్ నరిసంహారావు ఓ రకంగా.. ఏపీపై దండయాత్రే చేస్తున్నారు. జీవీఎల్ తీరుపై.. టీడీపీ ఎంపీలు ఫైరవుతున్నారు. ప్రత్యేకహోదా అంశంపై తనతో చర్చకు రావాలని సుజనా చౌదరి సవాల్ చేశారు.