వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆలోచించి చేసినా..ఆవేశంతో చేసినా.. పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించలేరు. ఇందుకు ఉదాహరణ ఏమిటంట.. సాక్షి పత్రిక కూడా ఈ వ్యాఖ్యలను మొదటి పేజీలో ప్రచురించలేదు. అంటే సాక్షి ఎడిటోరియల్ బోర్డు కూడా … జగన్ వ్యాఖ్యలను నిరసించినట్లే చెప్పాలి. ఎందుకు సాక్షి మొదటి పేజీలో ప్రచురించలేదు అంటే.. రాజకీయ ప్రభావం ఉంటుందన్న ఉద్దేశమే కారణం. పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యల ప్రభావాన్ని మనం గుర్తించాలి.
సెల్ఫ్ గోల్ 1 : పవన్‌పై అనాలోచిత వ్యాఖ్యలతో స్ట్రాటజిక్ ఓటింగ్ చాన్స్ మిస్..!
ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ పై.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు తగ్గించింది. పవన్ కల్యాణ్ మంగళగిరిలో నాలుగో ఆవిర్భావసభ పెట్టి జగన్ కూడా చేయని రీతిలో చంద్రబాబు, లోకేష్ లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ఎప్పుడైతే.. పవన్ కల్యాణ్.. చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారో… అప్పుడే.. వైసీపీ ఓ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఆ వ్యూహం ఏమిటంటే..చంద్రబాబు వర్సెస్ పవన్ కల్యాణ్ అన్న రాజకీయం నడుస్తూంటే.. తమకు ఉపయోగపడుతుందన్న వ్యూహాన్ని అమలు చేసింది. కచ్చితంగా ఉపయోగపడేది కూడా. ఎందుకంటే.. జనసేన ఇవ్వాళ ఓ ప్రధానమైన ఫోర్స్ కాదు. అనేక చోట్ల జనసేన ప్రజెన్స్ కూడా పెద్దగా లేదు. జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ ఏం చేయాలి.. ?. అయితే తెలుగుదేశం..లేకపోతే వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఇలాంటి సందర్భంలో.. తమ నాయకుడు పవన్ కల్యాణ్ టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో. టీడీపీని ఓడించాలంటే.. జనసేనకు ఓటు వేస్తే.. ఓడిపోతారా అన్న ఆలోచన జనసేన అభిమానుల్లో రావొచ్చు. ఎందుకంటే…తమ పార్టీ అభ్యర్థి ఎలాగూ ఓడిపోతాడు కనుక … ఒక వేళ ఓటు వేసినా..అది టీడీపీకి లాభిస్తుంది కాబట్టి,… వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండేది. అందుకే వ్యూహాత్మకంగా… జగన్ పార్టీ.. సైలెంట్ గా ఉంది. ఇలాంటి ఓటింగ్ జరగడాన్ని స్ట్రాటజిక్ ఓటింగ్ అంటారు. ఫలానా వాళ్లని గెలిపించడానికే కాకుండా.. ఓడించడానికి కూడా ఓటు వేస్తారు. ఇలాంటి స్ట్రాటజిక్ ఓటింగ్ తన పార్టీకి జరిగే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా పోగొట్టుకున్నారు.
సెల్ఫ్ గోల్ 2 : ఎంపీలతో రాజీనామాలు చేయించడం..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి… తన ఎంపీలతో రాజీనామాలు చేయించిన వ్యవహారం రెండో సెల్ఫ్ గోల్ గా చెప్పుకోవచ్చు. ఎంపీలతో రాజీనామాలు చేయించి..కేంద్ర ప్రభుత్వంలో వేడి పుట్టిస్తానని చెప్పారు. కానీ ఏమీ చేయకుండా కూర్చున్నారు. లోక్ సభలో తమ వాయిసే లేకుండా చేసుకున్నారు. ఏపీలో ప్రజల ముందుకూ వెళ్లలేదు. పరిస్థితిని తెలుగుదేశానికి పూర్తిగా అనుకూలంగా మార్చేశారు. ఎంపీల రాజీనాల వ్యవహారంపై ఆ పార్టీ ఎంపీల్లోనూ అసంతృప్తి ఉంది. రాజీనామాలు చేసిన తర్వాత ఉపఎన్నికలు రాకుండా ఆమోదింపచేసుకోవడంతో.. ప్రజల్లో ఓ రకమైన అనుమానాలొచ్చాయి. దాన్ని బలపరిచేలా.. కేంద్రంపై పల్లెత్తు మాట అనుకుండా.. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా..రోజులు గడిపేశారు. చివరికి అవిశ్వాస తీర్మానం సమయంలో సభలో లేకపోయేసరికి.. ప్రజల ముందు వైసీపీ పలుచనైపోయింది.
సెల్ఫ్ గోల్ 3: అసెంబ్లీని బాయ్ కాట్ చేయడం..!
ఇక జగన్ చేజేతులా చేసుకున్న మూడో సెల్ఫ్ గోల్…అసెంబ్లీ బహిష్కరణ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తూ..జగన్ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో.. ప్రభుత్వాన్ని నిలదీయడానికి.. ప్రజాసమస్యలు చర్చించడానికి ఉన్న ఎకైక అవకాశం..అసెంబ్లీ. ఆ అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుంది. నిజానికి తాము అసెంబ్లీని బహిష్కరించడానికి చెప్పుకున్న కారణం కూడా సమంజసమైనది కాదు. ఎందుకంటే… పార్టీ ఫిరాయింపులు చంద్రబాబుతోనే ప్రారంభం కాలేదు. బీజేపీ దగ్గర్నుంచి టీఆర్ఎస్ వరకూ అన్ని పార్టీలు ఫిరాయింపుల్ని ప్రొత్సహిస్తున్నాయి. అంటే..వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓ కారణం వెదుక్కుని.. అసెంబ్లీని బహిష్కరించింది. ఇది కావాలని తీసుకున్న తప్పుడు నిర్ణయం. దీని వల్ల ప్రజల్లో వైసీపీ ఇమేజ్ మరింతగా తగ్గిపోయింది.
సెల్ఫ్ గోల్ 4: ప్రభుత్వంపై పోరాడే పక్షాలను కలుపుకోలేకపోవడం..!
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం క్రియేట్ అయింది. ఇది మరింతగా పెరిగి.. చంద్రబాబును ఓడించాలన్న భావన కలిగితే.. సహజంగా.. నేచురల్ చాయిస్ అయిన జగన్మోహన్ రెడ్డికి లాభిస్తుంది. అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి..? ప్రభుత్వంపై తాను మాత్రమే పోరాటం చేయకుండా.. కలసి వచ్చే ప్రతి పక్షాన్ని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ జగన్ ఒంటెద్దు పోకడ పోతున్నారు. బంద్ కి పిలుపునిచ్చిన విధానమే దీన్ని స్పష్టం చేసింది. జనసేన, కాంగ్రెస్, వామపక్షాలను కలుపుకోవడానికి జగన్ సిద్ధంగా లేరు. ప్రయత్నించడం లేదు కూడా. ప్రభుత్వంపై పోరాటానికి ఇతరులు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా కూడా.. ఉపయోగించుకోవడం లేదు. ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నా. వినియోగించుకోలేకపోవడం నాలుగో సెల్ఫ్ గోల్.
సెల్ఫ్ గోల్ 5: బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం..!
ప్రజల్లో బీజేపీ పట్ల , మోడీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో.. బీజేపీకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీకి సన్నిహితంగా ఉన్నామనే ప్రచారం చేసుకున్నారు. టీడీపీ విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరగడానికి కారణం అయింది. ఇప్పటికీ బీజేపీపై జగన్మోహన్ రెడ్డి.. దూకుడుగా విమర్శలు చేయడం లేదు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొసాగిస్తున్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీని వల్ల బీజేపీపై ఉండే ప్రజావ్యతిరేకత వైసీపీపైకి మళ్లుతోంది.
కొంత కాలం వరకూ.. జగన్మోహన్ రెడ్డి..మెరుగైన రాజకీయాలే చేశారు. కానీ ఎన్నికల సమయానికి వచ్చే సరికి.. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్స్ చేసుకోవడం ప్రారంభించారు. ఆస్థాన సలహాదారుడు.. ప్రశాంత్ కిషోర్ ఉన్నారో లేదో తెలియదు కానీ. ..ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి.. బలహీనంగా మారారు.