గడువు కంటే ముందుగానే సాధారణ ఎన్నికలు వస్తాయన్న అంచనాతో టి. కాంగ్రెస్ సన్నద్ధమౌతున్న సంగతి తెలిసిందే. కింది స్థాయిలో పెండింగ్ ఉన్న నియామకాలను చకచకా పూర్తి చేస్తున్నారు. అంతేకాదు, జిల్లాలవారీగా పార్టీ కార్యక్రమాలపై శ్రద్ధ పెట్టాలంటూ హైకమాండ్ ఆదేశించిందంటూ తాజాగా పార్టీలో కొంత హడావుడి కనిపిస్తోంది. ఇదే సమయంలో విభేదాలను పక్కనబెట్టి, పార్టీ గెలుపుకోసం సీనియర్లంతా ఒకేతాటిపై నిలవాలని ఇప్పటికే అధిష్టానం పదేపదే సూచిస్తున్నా… కొంతమంది సీనియర్లు మాత్రం తమ ధోరణిని మార్చుకోవడం లేదనే చర్చ మళ్లీ వినిపిస్తోంది. ఈ దిశగా వినిపిస్తున్న పేరు… సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.
ఈ మధ్య జిల్లాలవారీగా వరుసగా పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ ఇచ్చారట! అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే పార్టీ సాధారణ కార్యక్రమాలకు ఈ మధ్య పొన్నాల హాజరు కావడం లేదని సమాచారం. అంతేకాదు, ఆ మధ్య కాంగ్రెస్ నిర్వహించిన బస్సుయాత్రకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి స్పందన వచ్చింది. పలు ప్రాంతాల్లో నిర్వహించిన సభలు పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చాయనే అనాలి. అయితే, ఈ సభల్లో ఎక్కడా పొన్నాల కనిపించకపోవడం గమనార్హం. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనర్హత వేటు వ్యవహారంపై తెరాస మీద తీవ్ర పోరాటమే చేసింది. ఈ సమయంలో కూడా పొన్నాల చొరవ అంతంత మాత్రంగానే కనిపించింది.
ఇవన్నీ ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయంగా మారుతున్నాయి. ఎందుకంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ తరఫున పెద్ద దిక్కు అంటూ ఉన్నది ఆయన మాత్రమే. కానీ, ఆయన తీరు చూస్తే ప్రస్తుతం ఇలా ఉంది. ఇంతకీ ఆయన అసంతృప్తి ఏంటనేది అందరికీ తెలిసిందే. పార్టీలో ఆయన కోరుకుంటున్న ప్రాధాన్యత ఏంటనేది కూడా రాష్ట్ర నేతలకు తెలియని వ్యవహారం కాదు. కాకపోతే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణం కాబట్టి, సీనియర్ నేతగా ఆయన అవసరం పార్టీకి అక్కరకు వస్తుంది కాబట్టి, ఇలాంటి సమయంలో తన ప్రాధాన్యతను గుర్తు చేయాలన్నదే ఆయన మౌనం వెనక ఉన్న వ్యూహం అనేది కొంతమంది విశ్లేషణ. ఎన్నికలు లోపుగానే పార్టీలో తన ప్రాధాన్యత ఏంటనే దానిపై ఒక స్పష్టమైన హామీ హైకమాండ్ నుంచి ఆయన ఆశిస్తున్నారనే అభిప్రాయమూ వినిపిస్తోంది. ఎలాగూ రాహుల్ గాంధీ త్వరలోనే రాష్ట్రానికి రాబోతున్నారు కాబట్టి, ఆయన రాక సందర్భంగా తనను బుజ్జగించే కార్యక్రమం ఉంటుందని ఆశిస్తున్నారనేవారూ లేకపోలేదు! ఏదేమైనా, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తమ ప్రాధాన్యత ఏంటనేదానిపై కాంగ్రెస్ లో ఇలాంటి అలకలూ మౌనముద్రలూ వేసేవారు ఇంకా పెరుగుతారేమో..!