భారత్ లో ఐసిస్ ఉగ్రవాద సంస్థను వ్యాపింపజేయడానికి యువతను ఆకర్షించి, ఐసిస్ సంస్థలో చేర్చుతున్న రఫిక్ అహమ్మద్ అనే వ్యక్తిని పోలీసులు నిన్న రాత్రి బెంగళూరులో అరెస్ట్ చేసారు. భారత్ లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ ముఖ్యనేతలలో అతను ఒకడు. అతనిని అరెస్ట్ చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థ తెలంగాణా, కర్ణాటక, గుజరాత్, డిల్లీ పోలీసుల సహకారం తీసుకొని పరప్పన అగ్రహారంలో అతను నివాసం ఉంటున్న ఇంటిని నిన్న రాత్రి చుట్టుముట్టి పట్టుకొన్నారు. అక్కడ అతను ఒక ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నానని చెప్పుకొని గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. కానీ అతను చేసే ప్రధానమయిన పని ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం దేశంలో యువతని ఆకర్షించి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేర్చడం.
2013 లో హైదరాబాద్ దిల్ షుక్ నగర్ బాంబు ప్రేలుడు కేసులో అతని ప్రమేయం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. విశేషం ఏమిటంటే ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తూనే మరోపక్క కర్ణాటకలో బాగల్ కోట్ అనే ప్రాంతంలో యాస్మిన్ భాను అనే యువతితో ప్రేమ కలాపాలు కూడా సాగించి పెళ్లి చేసుకొన్నాడు. అతని ఆచూకి కోసం పోలీసులు చాలా కాలంగా వెతుకుతున్నారు. గత రెండు మూడు రోజులుగా ఎన్.ఐ.ఏ. అధికారులు కర్ణాటకతో సహా దేశంలో వివిధ రాష్ట్రాలలో ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ చేసినప్పుడు రఫిక్ అహమ్మద్ బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఐసిస్ కోసం యువకులను నియామకాలు చేస్తున్నాడని తెలిసింది. నాలుగు రాష్ట్రాల పోలీసులు కలిసి అతని గురించి పూర్తి సమాచారం సేకరించిన తరువాత అతను తన గదిలో భోజనం చేస్తున్న సమయంలో వలపన్ని పట్టుకొన్నారు. పోలీసులను చూసి అతను తప్పించుకొని పారిపోబోయాడు కానీ సాధ్యం కాలేదు. ఆ ప్రయత్నంలో శ్రీనివాసులు అనే కానిస్టేబుల్ ని అతను కత్తితో గాయపరిచాడు.
అతను మొదట్లో జైషే అహ్మాద్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేసేవాడు. తరువాత ఐసిస్ ఉగ్రవాదులతో చేతులు కలిపాడు. ఐసిస్ సంస్థ భారత్ లో డిప్యూటీ కమాండర్ గా తనను తాను ప్రకటించుకొన్న రిజ్వాన్ అలీ అనే ఉగ్రవాదిని కూడా ఎన్.ఐ.ఏ. అధికారులు అరెస్ట్ చేసారు. ఇంతవరకు మొత్తం 14 మంది ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ చేయబడ్డారు. ఎన్.ఐ.ఎ. అధికారులు వారినందరినీ ప్రశ్నించడానికి డిల్లీ తరలించబోతున్నారు.