మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఏపీలో పార్టీకి కొత్త ఊపు తేవాలంటే గతంలో వేలు విడిచిన నేతల్ని వెనక్కి రప్పించే పనిలో ఆ పార్టీ ఉంది. కిరణ్ చేరాక అప్రకటితంగానే ఏపీలో పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు ఆయనకి కట్టబెట్టారు. ఇతర నేతల చేరికల బాధ్యత కూడా ఆయనపైనే పెట్టారట. కిరణ్ చేరిన తరువాత, పార్టీ ప్రచార వ్యూహాన్ని ఆయనే ఖరారు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది! ఇకపై, రాజకీయంగా ఏయే పార్టీలపై మాటల దాడికి దిగాలీ, ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించాలనేది అంతా కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన ప్రకారమే జరగబోతోందని ఏపీ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ ప్రస్తుత టార్గెట్.. ప్రతిపక్ష పార్టీ వైకాపా.
కాంగ్రెస్ ఓటుబ్యాంకులో చాలా భాగం అక్కడే ఉంది. కాబట్టి, ముందుగా జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు ఉండాలనేది చాన్నాళ్ల కిందటే రాహుల్ గాంధీ కూడా సూచించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి ఉపేక్షిస్తున్నామనే వాదనను పక్కనబెట్టాలనీ అప్పుడే నేతలకు క్లాస్ తీసుకున్నారు. అయితే, ఇప్పుడా వ్యూహమంతా కిరణ్ కుమార్ ఖరారు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రబంద్ కి వైకాపా పిలుపునిస్తే… రఘువీరా రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. బంద్ చేసి వైకాపా ఏం సాధిస్తుందని ప్రశ్నించారు. కిరణ్ సలహాతోనే వైకాపాకి వ్యతిరేకంగా రఘువీరా అంత ఘాటుగా మాట్లాడారని తెలుస్తోంది. త్వరలోనే ఏపీలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ సభలో కూడా వైకాపాని లక్ష్యంగా విమర్శలు గుప్పించాలనీ, జగన్ క్రియాశీలత్వాన్నే ప్రధానంగా ప్రశ్నించాలని కిరణ్ భావిస్తున్నారట! ఆంధ్రా అభివృద్ధికి వైకాపా ప్రత్యామ్నాయం కాలేదన్న వాదనను వినిపించబోతున్నారట.
దీంతోపాటు, మరో ప్రధానమైన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది కిరణ్ అభిప్రాయంగా తెలుస్తోంది! అదేంటంటే… ఆంధ్రాకి న్యాయం జరగాలంటే అది జాతీయ స్థాయిలో జరగాల్సిన పని. భాజపా ఎలాగూ చెయ్యదు.. అది కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమనేది ప్రజలకు అర్థమయ్యే వివరించాలనుకుంటున్నారట. టీడీపీ, వైకాపా, జనసేనల్లాంటి పార్టీలు ఎన్ని ఉన్నా.. అవి ప్రాంతీయ పార్టీలు మాత్రమేననీ, ఎన్నికల తరువాత ఏదో ఒక జాతీయ పార్టీకి మద్దతు ఇస్తే తప్ప వారు సాధించేది ఏదీ ఉండదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారట. హోదాతో సహా ఆంధ్రాని అన్ని రకాలుగా అభివృద్ధి చెయ్యాలంటే కేవలం జాతీయ పార్టీ కాంగ్రెస్ వల్లనే సాధ్యమౌతుందనే ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే భవిష్యత్తు కార్యక్రమాలు ఉంటాయని సమాచారం.