భీమవరంలో జరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, ఆయన తాజాగా చేసిన కామెంట్లపై మరోసారి స్పందించారు. వ్యక్తి జీవితాలపై వ్యాఖ్యలు చేసేవారిని అందరినీ కలిపినా కూడా, అన్ని కోణాల నుంచీ పరిశీలించినాగానీ వారి కంటే తాను చాలా బెటర్ అని పవన్ చెప్పారు. వ్యక్తిగత విమర్శలే చేయాలనుకుంటే ఎదుటివారు తట్టుకోలేనంతగా ఒప్పుకోలేనంతగా భరించలేనంతగా చెయ్యగలనన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం వల్ల భీమవరానికి డంపింగ్ వస్తుందంటే తాను పడతా అన్నారు. అలాంటి విమర్శల వల్ల పబ్లిక్ పాలసీలు మారవన్నారు. నాయకులంతా పార్లమెంటరీ వ్యవస్థపై గౌరవంతో ఉండాలన్నారు. వ్యక్తిగత జీవితాలు ఎవ్వరివీ ఏమంత గొప్పగా లేవిక్కడ అన్నారు. అవే మాట్లాడాలంటే చాలా మాట్లాడగలనన్నారు.
తనను ఎవరో తప్పుతోవ పట్టిస్తున్నారంటూ మంత్రి లోకేష్ అంటున్నారనీ, ఆయనేమన్నా చూశారా అంటూ పవన్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే తనని ఎవరో తప్పుతోవ పట్టించినట్టా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, జగన్ లు కలిసి ఒకవేదిక మీదికి వస్తే… భీమవరం అభివృద్ధి గురించి తాను ప్రశ్నిస్తాననీ, చర్చకు రమ్మంటూ పవన్ సవాలు చేశారు. బాంబులేస్తామనో వేట కత్తులతో వస్తామనో ఫ్యాక్షనిజాన్ని చూపిస్తామనో అంటే భయపడేవాడిని కాదనీ, విప్లవాన్ని గుండెల నిండా నింపుకుని వచ్చానని పవన్ చెప్పారు.
తాను జగన్ ను ఒకటే అడిగాననీ, అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోతున్నారన్నారు. ఆక్వాఫుడ్ పార్క్ సమస్య, జనాలు తాగడానికి చుక్క నీరు లేదు.. ఇలాంటి సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు అంటూ జగన్ ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మాట్లాడుతూ… పంచాయతీ ఎన్నికలు పెట్టాలనీ, జనసేన పాల్గొంటుందని అన్నారు. ఎన్నికలు పెట్టకపోతే నిధులు రావన్నారు. కేవలం అనుభవం కోసమే తాను ఇన్నాళ్లు వేచి చూశాననీ, దాదాపుగా దశాబ్దానికి పైగా క్రియాశీల రాజకీయాల్లో ఉంటున్నానన్నారు. పోలీసుల గురించి మాట్లాడుతూ… పైనుంచి వారి మీద చాలాచాలా ఒత్తిళ్లు ఉంటాయనీ, తన తండ్రి కానిస్టేబుల్ అనీ, ఒత్తిడి అంటే ఎలా ఉంటుందో తనకు తెలుసు అన్నారు పవన్.
దీంతోపాటు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై యథావిధిగా కొన్ని విమర్శలు చేశారు. స్థానికంగా సమస్యల్ని ప్రస్థావిస్తూ… నాలుగేళ్లపాటు ఎందుకు పరిష్కారాలు చూపలేకపోయారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ చేసిన విమర్శల్నే ప్రధానంగా ప్రస్థావిస్తూ తిప్పికొట్టే ప్రయత్నమే పవన్ ప్రసంగంలో ప్రముఖంగా ఉంది. ఎవ్వరి జీవితాలు గొప్పగా లేవంటూ జనరలైజ్ చేసినట్టు పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం.