కాశ్మీర్ సమస్య అలానే ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే భాజపా మద్దతు ఉప సంహరణతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయింది. ఇక, వ్యాలీలో అసాంఘిక శక్తుల ప్రభావం ఎక్కువైనట్టుగానే ఈ మధ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో ఎన్నికలు జరగడం, ఆర్మీ అండదండలతో ఇమ్రాన్ ఖాన్ గెలవడం, ఆ తరువాత ఆయన చేస్తున్న ప్రకటనలు.. ఇవన్నీ కాశ్మీర్ విషయంలో భవిష్యత్తులో కాస్త ఇబ్బంది కలిగించే వాతావరణం ఉండబోతోందనే సంకేతాలే వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ తో ఇండియాకి ఇబ్బందులు ఉంటాయేమో అనే అంచనాలే ఢిల్లీ వర్గాల్లో చర్చనీయం అవుతోంది.
అయితే, ఈ అంశమై ఇమ్రాన్ ఇప్పటికే స్పందించారు. ఇండియాలో తనను విలన్ గా చిత్రిస్తున్నారని అన్నారు. అయితే, కాశ్మీర్ విషయానికి వచ్చేసరికి భారత్ ఒక అడుగు ముందుకు వేస్తే, పాకిస్థాన్ రెండు అడుగులు వేస్తుందన్నారు! ఈ వ్యాఖ్య కొంత వివాదాస్పదంగానే ఉంది. తాజాగా ఆయన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే.. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని అంటారు, కానీ భారత్ సత్సంబంధాలు అనే మాట చెప్పడం లేదు. భారతీయ నాయకులతో చర్చిస్తా అంటారు, కానీ అది ప్రధానమంత్రితోనా మరొకరితోనా అనేది స్పష్టంగా చెప్పడం లేదు! అలాగని, కాశ్మీరు విషయం వచ్చేసరికి కవ్వింపు వ్యాఖ్యలూ తగ్గించడం లేదు. ఇంకోపక్క చైనాను పొగడ్తలతో ముంచెత్తేయడం కూడా గమనార్హం. చైనాతో సత్సంబంధాలు ఉంటాయనీ, వారు ఏం చెబితే అదే పాక్ లో జరుగుతుందన్నట్టుగా ఇమ్రాన్ మాట్లాడటం కూడా వివాదాస్పదంగానే కనిపిస్తున్నాయి.
ఓపక్క చైనాకు దాసోహం అన్నట్టుగా మాట్లాడుతూ, మరోపక్క ఇండియా గురించి ప్రస్థావనకు వచ్చేసరికి… కాశ్మీర్ విషయంలో ఏ స్థాయికైనా వెళ్తామనడం, ఇవన్నీ రెచ్చగొట్టే చర్యల్లానే ఉన్నాయి. అయితే, పాక్ ప్రజలకు ఎమోషనల్ గా దగ్గర కావడం కోసమే ఇండియా విషయంలో ఇమ్రాన్ ఇలాంటి వైఖరిని అధికారం చేపట్టకముందే అందుకున్నారనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా, సమీప భవిష్యత్తులో కాశ్మీరు అంశమై పాక్ నుంచి కొన్ని కవ్వింపులు ఉండేలానే వాతావరణం కనిపిస్తోంది. ఇదే సమయంలో… కాశ్మీరులో స్థిరమైన ప్రభుత్వం లేదు. ఈ విషయంలో భాజపా ఆలోచనలు కూడా మరోలా కనిపిస్తున్నాయి! వచ్చే లోక్ సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కాశ్మీరులో రాజకీయ ప్రయోజనాలకు భాజపా ప్రయత్నిస్తోందన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో పాక్ నుంచి ఇలాంటి సంకేతాలు వెలువడుతున్నాయి. కనీసం ఇప్పుడైనా కేంద్రం వైఖరిలో రాజకీయ ప్రయోజనాల పరిధిని దాటి ఆలోచించే పరిస్థితి ఉంటుందనే ఆశించాలి.