వేమనగారు అదేదో శతకంలో చెప్పినట్టు… కంటిలోని నలుసులా, కాలికింద ముల్లులా, చెప్పులోని రాయిలా, చెవిలోని జోరీగలా పెళ్లి వార్తలు కథానాయికలను తెగ కంగారు పెడుతున్నాయి. చిన్నప్పుడు స్కూల్లో మాస్టారు చెప్పిన ‘నాన్నా… పులి’ కథ గుర్తుందా? పిల్లాడు పులి వచ్చిందని నాన్నకు అబద్ధం చెబుతాడు. మొదట నమ్మేసిన నాన్న.. నిజంగా పులి వచ్చినప్పుడు అబద్ధం అనుకుని చూడడు. సేమ్ టు సేమ్ కథానాయికల పెళ్లిళ్ల విషయంలో ఇదే కథ రిపీట్ అవుతోంది.
కథానాయికల్లో ఎవర్ని తీసుకున్నా… ఆమెకు ఇంట్లో చూసే సంబంధాల కంటే సినిమా మీడియాలోని ఓ వర్గం లేదా కొందరు గాసిప్‌రాయుళ్లు చూసే సంబంధాలు ఎక్కువ. ‘ఇది విన్నారా… ఫలానా హీరోయిన్‌కి పెళ్లి అంట’, ‘మీకు తెలుసా… ఈ హీరోయిన్‌కి కాబోయే వరుడు ఎవరో?’ అంటూ పెళ్లి వార్తలను ప్రసారం చేస్తున్నారు. పెళ్లి కొడుకు వివరాలనూ చెప్పేస్తున్నారు. ఈ పుకార్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తెలియక కథానాయికలు తలలు పట్టుకుంటున్నారు. పుకార్లను ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నారు.
పెళ్లి పుకార్లను ఖండించిన హీరోయిన్ల లిస్టులో చేరిన లేటెస్ట్ అమ్మాయి తమన్నా. తన పెళ్లి పుకారుపై మిల్కీ బ్యూటీ గట్టిగానే స్పందించింది. “ఓసారి యాక్టర్ అన్నారు. తర్వాత క్రికెటర్ అన్నారు. ఇప్పుడు డాక్టర్ అంటున్నారు. మీ వాలకం చూస్తుంటే నేను భర్త కోసం షాపింగ్ చేస్తున్నట్టుంది. నేనే కాదు, మా పేరెంట్స్ కూడా పెళ్లికొడుకు కోసం వెతకడం లేదు. సినిమాలతో బిజీగా వున్నాను. పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటా. అప్పటివరకూ మీ ఊహలతో నాకు పెళ్లి చేయకండి” అని కొంచెం గట్టిగానే పుకార్లను సృష్టించిన వాళ్లకు క్లాస్ పీకారు.
తమన్నాకు కాబోయే వరుడు డాక్టర్ అని మాత్రమే వార్తలు వచ్చాయి. తాప్సికి అయితే ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసి గాసిప్ రాసేశారు. దాంతో ‘నా ఎంగేజ్మెంట్కి నన్నూ పిలవండి’ అని తాప్సి సెటైర్స్ వేశారు. తమన్నా, తాప్సి స్పందనలు ఉదాహరణలు మాత్రమే. కాజల్ అగర్వాల్, అనుష్కలకు అయితే ఎన్నిసార్లు పెళ్లిళ్లు చేసేశారో. మెగా డాటర్ నిహారిక కూడా మీడియా చాలా పెళ్లి సంబంధాలు చూసింది. అందుకనే ‘హ్యాపీ వెడ్డింగ్’ పబ్లిసిటీలో భాగంగా ఒక సెటైరికల్ వీడియో రెడీ చేసి విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఆత్మీయుల మధ్య చేసుకోవాలనే వేడుక పెళ్లి. కానీ, మీడియాలోని ‘పెళ్లి గోల’తో కథానాయికలు సంతోషంగా వుండటం లేదు. దే ఆర్ నాట్ హ్యాపీ.
కొసమెరుపు: మీడియాలోని ‘పెళ్లి గోల’ కార్యక్రమాలతో ఎవరికైనా ఒకవేళ నిజంగా పెళ్లి కుదిరినా ప్రేక్షకులు నమ్మే పరిస్థితి పోయింది. పెళ్లి ఫొటోలు వచ్చాక చూద్దాంలే అనుకుంటున్నారు. శ్రియ పెళ్లి విషయంలో అదే జరిగింది. లేటెస్టుగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లి కోసమే సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమా వదులుకుంది వార్తలు వస్తున్నా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు.