నెట్టింట్లో రచ్చ చూసి జడుసుకున్నాడో…. ట్రాల్స్ దెబ్బకి భయపడ్డాడో… మరొకటో… ‘గీత గోవిందం’ ఆడియోలో హీరో విజయ్ దేవరకొండ రెండు మెట్లు దిగినట్టే కనిపించాడు. ‘అర్జున్‌రెడ్డి’ ఆడియోలో చూసిన హీరోయేనా ఇతను అనుకునేలా కొంచెం తగ్గి మాట్లాడాడు. ‘అర్జున్‌రెడ్డి’లో ఒక వర్డ్ మ్యూట్ చేసినందుకు స్టేజి మీదే విజయ్ దేవరకొండ నానా రచ్చ చేశాడు. యూత్ అంతా థియేటర్లలో ఆ బీప్ సౌండ్ వచ్చినప్పుడు డబ్బింగ్ చెప్పాలని కోరాడు.
‘గీత గోవిందం’లో ‘వాట్ ద ఎఫ్…’ సాంగ్ కాంట్రవర్సీకి వచ్చేసరికి అటువంటి ప్రొగ్రామ్స్ పెట్టలేదు. సైలెంట్ అయ్యాడు. విజయ్ దేవరకొండ పాడిన ఈ పాట విషయంలో ఎంత రచ్చ జరిగిందో కొత్తగా చెప్పనవసరం లేదు. లిరిక్స్ విషయంలో కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తే… విజయ్ పాడిన తీరుపై ఇంటర్‌నెట్‌లో యూత్ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆ సెటైర్స్ అన్నిటినీ విజయ్ దేవరకొండ లైటర్ నోట్‌లో తీసుకున్నాడు. ‘గీత గోవిందం’ ఆడియోలో ట్రాల్స్‌లో కొన్నిటిని ప్లే చేయించాడు. ‘‘ఓ రెండు రోజులు నన్ను ఎంత గట్టిగా వేసుకున్నారబ్బా’’ అని అన్నాడంటే విజయ్ దేవరకొండ మీద ట్రాల్స్ ఎఫెక్ట్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అంతేనా? ‘‘బన్నీ అన్నా… ఎంత రచ్చ జరిగిందో నువ్వు చూశావా’’ అని అడిగాడు. అందుకు తెలుసు అన్నట్టు బన్నీ తల ఊపాడు. ప్రేక్షకులకు తన సింగింగ్ నచ్చలేదని అర్థమైనట్టు చెప్పుకొచ్చాడు. లిరిక్స్ కూడా మార్చారు. ‘వాట్ ద ఎఫ్’ సాంగ్‌లోని ‘ఎఫ్’ కాస్తా ‘లైఫ్’ అయ్యింది. కొత్త పాటను ఈ రోజు విడుదల చేశారు.
పాటలో లిరిక్స్ మార్చడం ఒకటి అయితే… సింగర్‌ని కూడా మారుస్తానని విజయ్ దేవరకొండ అంటున్నాడు. సినిమాలో పాట పాడింది అతనే. ఇప్పుడు ప్రేక్షకులను పాడి పంపించమంటున్నాడు. ‘గీత గోవిందం’ టీమ్‌కి ఎవరి వాయిస్ అయితే నచ్చుతుందో వాళ్లతో సినిమాలో పాడిస్తానని ఆడియన్స్‌కి ఆఫర్ ఇచ్చాడు.
‘అర్జున్‌రెడ్డి’ టైమ్‌లో విజయ్ దేవరకొండకి యూత్ నుంచి ఎక్కువ సపోర్ట్ లభించింది. ఇప్పుడు అదే యూత్ ఏ రేంజ్‌లో ఆడుకున్నారు. ఇంటర్‌నెట్‌లో ఎక్కువశాతం ట్రాల్స్ చేసేది వాళ్లే కదా! వాళ్లకు విజయ్ దేవరకొండ సింగింగ్ నచ్చలేదు. దాంతో కాంట్రవర్సీ చేసినట్టు లేడు. సింగర్‌గా తన లాంఛింగ్ ఫెయిల్ అయ్యిందని స్టేజి మీద విజయ్ దేవరకొండ అంగీకరించడం గమనార్హం.