వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి… కాపు రిజర్వేషన్లు ఇవ్వడం కానీ..సాధించడం కానీ తన చేతుల్లో లేదని చెప్పిన తర్వాత అనూహ్యంగా రాజకీయ పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకూ.. వైసీపీకి బ్యాక్ డోర్ పాలిటిక్స్‌లో పిల్లర్‌లా నిలిచిన ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. అది కాపు రిజర్వేషన్ల అంశంపై మాత్రమే కాదు.. తాను పాదయాత్రలో ఇస్తున్న హామీలపై కూడా. ఇంతటితో సరిపెట్టలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకం ఉందన్నారు. ఈ మాటలోనే చాలా మార్పు కనిపిస్తోంది. ఇంత కాలం చంద్రబాబుపై అపరిమితమైన ద్వేషాన్ని ప్రదర్శించిన ముద్రగడ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం.. రాజకీయవర్గాలను ఆశ్చర్య పరచకుండా ఉంటుందా..?
నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రెండేళ్లు చంద్రబాబు ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. రాజధానిని అమరావతికి తరలించడం దగ్గర్నుంచి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకోవడం వరకు.. చాలా …చాలా సవాళ్లను ఆయన ఒంటి చేత్తో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలోనే ముద్రగడ పద్మనాభం.. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని తెచ్చిపెట్టారు. 2016 జనవరి 31న జరిగిన రైలు దహనం, పోలీస్ స్టేషన్లపై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ముద్రగడ కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సోలో లీడర్‌గా ఎదిగారు. ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే అందండలు అందించింది. విధ్వసంలో భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. తర్వాత జగన్ చేపట్టిన దీక్షల్లోనూ ముద్రగడ కనిపించారు. ఇక తాను సొంతంగా ఇంట్లో చేసిన దీక్షల ఉద్యమాలతో ముద్రగడ కాస్తంత వేడి పుట్టించారు. ఓ సారి దీక్ష సమయంలో పోలీసులు చాలా గట్టిగానే వ్యవహరించడంతో చంద్రబాబుపై మరింత కోపం తెచ్చుకున్నారు. తన కుటుంబసభ్యులను కొట్టారని… అనుచితంగా ప్రవర్తించారని… చంద్రబాబును పదవి నుంచి దింపేసేదాకా తాను విశ్రమించనని ప్రకటనలు కూడా చేశారు.
చివరికి చంద్రబాబు అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి.. ఢిల్లీకి పంపిన తర్వాత కూడా ఆయన చంద్రబాబును మనస్ఫూర్తిగా అభినందించలేదు. ఏదో కారణం చెప్పి చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిన్నామొన్నటి వరకూ.. వారానికో లేఖ చొప్పున రాసేవారు. చంద్రబాబు జైలుకెళ్లడం తథ్యమని హెచ్చరించేవారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ ఎంపికవగానే… ఉన్న పళంగా గుంటూరు వెళ్లి చర్చలు జరిపి వచ్చారు. చంద్రబాబును భయంకరంగా తిట్టి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులును కూడా అదే వేగంతో వెళ్లి కలసి వచ్చారు. అలాంటి ముద్రగడ.. జగన్ రిజర్వేషన్లు ఇవ్వలేనన్నాడన్న కారణంతో.. ఒక్కసారిగా చంద్రబాబుపై నమ్మకం వ్యక్తం చేయడం కచ్చితంగా కీలక పరిణామమే.
అంతే కాదు.. చంద్రబాబు రిజర్వేషన్లు తీసుకొస్తాడని… దాన్ని జగన్ అడ్డుకుంటున్నారని కూడా… ముద్రగడ వ్యాఖ్యానించడం ఇందులో గమనించదగ్గ మరో అంశం. ఈ విషయంలో ముద్రగడ…వ్యూహం ఏమిటో కానీ.. ప్రస్తుతానికైతే.. పూర్తిగా చంద్రబాబుకు ఫేవర్ గా మారింది. ఇది కచ్చితంగా ఎన్నికలకు ముందు టీడీపీకి అనుకూలించేదే. ఎందుకంటే.. కాపు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక చేయగలిగిందేమీ లేదు. ప్రత్యేకహోదాపై పోరాడుతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇక చంద్రబాబు చెప్పేది ఒక్కటే.. పార్లమెంట్ ఎన్నికలలో.. 25కి 25 పార్లమెంట్ సీట్లు గెలుపొందుదాం.. ప్రత్యేకహోదా, కాపు రిజర్వేషన్లు సాధిద్దాం అని. కనీసం వచ్చే ఎన్నికల వరకైనా.. ముద్రగడ.. చంద్రబాబుపై నమ్మకం అనే తన విధానాన్ని కొనసాగించక తప్పదు.