నాన్నకు ప్రేమతో చిత్రం విజయోత్సవాన్ని తాజాగా చాలా ఘనంగా జరుపుకున్నారు. కానీ.. తమాషా ఏంటంటే.. పేరుకు విజయోత్సవం జరుపుకున్నారు గానీ.. తమ ప్రసంగాల్లో చాలా మంది ప్రముఖ వక్తలు.. కలెక్షన్ల మీద ఒక రకమైన అసంత్రుప్తిని వ్యక్తం చేయడం విశేషం.
ఈ సమావేశంలో మాట్లాడుతూ సినిమాకు సంబంధించి ఇది చాలా మంచి ఫీలింగ్‌ను కలిగించిన సినిమా అని పొగుడుకుంటూనే.. కలెక్షన్లు ఆశించి చేసిన సినిమా కాదిది అంటూ వాళ్లు చెప్పుకోవడాన్ని గమనిస్తే.. అందరూ ఆ విషయంలో ఆశాభంగం చెందారని అర్థమవుతోంది. ఈ కార్యక్రమంలో అటు రాజేంద్రప్రసాద్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ కలెక్షన్లు అనుకున్నంతగా లేవు అనే సం గతినే.. తమకు తోచిన రీతిలో.. తమకు వీలైన మాటల్లో వ్యక్తీకరించారు.
నిజానికి నాన్నకు ప్రేమతో చిత్రానికి విడుదలకు ముందునుంచి రకరకాల ఇబ్బందులు ఎదురైన సంగతి అందరికీ తెలుసు. బాలయ్య తన చిత్రానికి థియేటర్లు బుక్ చేసేసుకుని.. నాన్నకు ప్రేమతో చిత్రానికి థియేటర్లు లేకుండా చేసేశారని, బాబాయి అబ్బాయిల మద్య వివాదానికి ఇది పరాకాష్ట అని పుకార్లు వెల్లువగా వచ్చాయి. ఆ దెబ్బ ఎంతో కొంత సినిమా మీద పడింది. అప్పటికీ తొ లిరోజున 1700 థియేటర్లలో నాన్నకు ప్రేమతో విడుదల అయింది
ఈ విషయంలో జూనియర్ చాలా వరకు మౌనం పాటించారు గానీ.. విజయోత్సవ వేడుకలో ఆయన మాటల్లో లోలోపల ఉన్న అసలు ఫీలింగ్ బయటకు వచ్చేసింది. ఇది కలెక్షన్ల కోసం చేసిన కమర్షియల్ సినిమా కాదు. నేను, సుకుమార్ ఇలాంటి మంచి చిత్రం చేయాలని ఎంతో వ్యామోహంతో చేశాము. కలెక్షన్లను పట్టించుకోకుండా.. నిర్మాత భోగవల్లి ప్రసాద్ కూడా అంతే వ్యామోహంతో సినిమా చేశారు… వంటి డైలాగులతో ఆకట్టు కోవాలని జూనియర్ ప్రయత్నించారు. కానీ ఆయన మాటల్లో కలెక్షన్లు వారు ఊహించిన రీతిలో లేవనే సంగతి మాత్రం తెలిసిపోతున్నదని కార్యక్రమానికి హాజరైన వారు వ్యాఖ్యానించుకోవడం విశేషం.