యాక్షన్ , ఫ్యాక్షన్, లవ్, కామెడీ, సెంటిమెంట్, ఫార్ములా… ఇలా రకరకాల జోనర్లలో కథలు పుడుతుంటాయి, ఒక్కో సీజన్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఒకసారి యాక్షన్ కధలు వరుస కడితే… మరోసారి లవ్ స్టోరీలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడిపోతుంటాయి. ఐతే ఈ సారి వెరైటీ గా ‘పెళ్లి’ కథలు ఎక్కువయ్యాయి. ఏ కథ ఐనా.. హీరో హీరోయిన్లు కలసిపోవడంతోనో, పెళ్లి చేసుకుంటూ గ్రూప్ ఫోటో కి ఫోజు ఇవ్వడంతోనో ‘శుభం’ కార్డు వేసుకుంటుంది. ఐతే ఈ పెళ్లి కథలు మాత్రం కేవలం పెళ్లి చుట్టూనే తిరుగుతుంటాయి. ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘చి.ల.సౌ’, ‘శ్రీనివాస కళ్యాణం’ ఇలాంటి చిత్రాలే.
అప్పట్లో గుణశేఖర్ ‘వరుడు’ అనే సినిమా తీసాడు. ఐదు రోజుల పెళ్లి అనే కాన్సెప్ట్ తో. నిజంగా అలాంటి ప్రయత్నం అప్పటి వరకూ ఎవరూ చేయలేదు. ఆ సినిమా గనుగ బాగా ఆడితే… ఆ తరహా కథలు మరిన్ని వచ్చేవి. కానీ ఫ్లాప్ అవ్వడంతో అటు వైపు ఎవరూ ఆలోచించలేదు. నందిని రెడ్డి తీసిన ‘కళ్యాణ వైభోగమే’ కూడా పెళ్లి కథే. పెళ్లి విశిష్టతని సన్నివేశాల్లో చెప్పే ప్రయత్నం చేశారు, ‘పెళ్లి చూపులు’ కూడా ఒకరకంగా పెళ్లి కథే. కాకపోతే అందులో పెళ్లి గురించి చర్చించిన దాఖలాలు లేవు. . ఇప్పుడు హ్యాపీ వెడ్డింగ్, శ్రీనివాస కళ్యాణం, చి.ల.సౌ వస్తున్నాయి. ఇవి మాత్రం కేవలం పెళ్లి కథలు. హ్యాపీ వెడ్డింగ్ లో… అమ్మాయిల తాలూకూ మనోభావాలని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అమ్మా నాన్నలని వదిలి, ఓ కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు వాళ్లకి ఎన్ని రకాల భయాలు వుంటాయో అక్షర పాత్ర ద్వారా చూపించారు. నిర్చితార్ధం నుంచి పెళ్లి వరకూ జరిగే కథ ఇది. కాబట్టి తెరపై పెళ్లి హడావుడి కనిపిస్తుంటుంది.
చిలసౌ… టైటిల్ చూస్తుంటే పెళ్లి కథ అనిపిస్తుంది. ఐతే దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దీన్ని ఓ ప్రేమ కథగా మలిచే ప్రయత్నం చేసినట్టు టాక్. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి, అమ్మాయి.. కలిసి ఓ రోజు చేసే జర్నీ ఈ సినిమా. పెళ్లి చూపుల్లో ‘నో’ చెప్పుకున్న వాళ్ళు చివరికి ‘యస్’ చెప్పుకుని ఎలా పెళ్లి చేసుకున్నారో చూపిస్తున్నారు. పెళ్లి కి సంబంధించిన ప్రస్తావన, ఈ విషయం లో అబ్బాయిలు, అమ్మాయిల మనోభాబాలు ఎలా వుంటాయో చర్చించనున్నారు,. ఇక శ్రీనివాస కళ్యాణం.. నూటికి నూరుపాళ్లు పెళ్లి కథ. పెళ్లి విశిష్టతని చెప్పడమే కాదు, పెళ్లి తంతులు, వాటి ప్రాధాన్యం ఇందులో వివరిస్తున్నారట. వాటి మధ్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందట.
కథ ఎలాంటిదైనా దాన్ని కనుల పండగగా ప్రేక్షకులకి అందించాలి. పెళ్లి కథ లోనే బోలెడంత సంబరం ఉంటుంది. ఆటపాటలు, కేరింతలు కనిపిస్తాయి. ఎమోషన్స్ ఉంటాయి. సరిగ్గా చూపించగలిగితే తప్పకుండా ప్రేక్షకులు కనెక్ట్ ఐపోతారు. పైగా ఇలాంటి సినిమాలకి ఏ, బి, సి అనే విభజన రేఖ పనిచేయదు. అందరికీ నచ్చుతాయి. అందుకే మన దర్శకులు పెళ్లి కథలపై ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ సినిమాల్లో దేనికి పూర్తి మార్కులు పడతాయో… ప్రేక్షకులే తీర్పు ఇవ్వాలి.