మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల మీదే ఫోకస్ పెడుతున్నారు. క్రియాశీల రాజకీయాలకు చాలాదూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా అని ప్రశ్నిస్తే, ఆ పార్టీ వర్గాల నుంచే సరైన సమాధానం రాదు. అయితే, ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో పార్టీకి సేవలందించి, తటస్థంగా ఉన్నవారిని వెనక్కి రప్పించే పనిలో ఉంది. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. ఇదే క్రమంలో చిరంజీవి లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న నాయకుడు మరింత క్రియాశీలం అయితే పార్టీకి కొత్త ఊపు వచ్చేందుకు ఉపయోగపడుతుంది.
ఇంతకీ, చిరంజీవి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారా అంటే… చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాల నమ్మకం. ఇదే అంశమై రాహుల్ గాంధీతో చిరంజీవి మాట్లాడారనీ, ఎన్నికలకు కొన్ని నెలల ముందు వచ్చి ప్రచారం చేస్తారని అన్నారట. అదే విషయం తనతో కూడా చెప్పారంటూ ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా అంటున్నారు. ఓ నెల్రోజుల క్రితమే చిరంజీవి ఈ మాట తనతో చెప్పారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
చెప్పినట్టుగా కాంగ్రెస్ తరఫున ప్రచారానికి ఆయన రాగలరా అంటే.. అనుమానమే. ఎందుకంటే, ఓ పక్క మెగాస్టార్ అభిమానులు జనసేనలోకి ఈ మధ్యనే పెద్ద ఎత్తున చేరారు. చిరంజీవి ఫ్యాన్స్ రాజకీయంగా పవన్ కల్యాణ్ కి మద్దతుగా ఉంటారనే సంకేతాలు ఇచ్చారు. పైగా, పవన్ కల్యాణ్ కూడా కాంగ్రెస్ పై ఏమంత సున్నితంగా వ్యవహరించడం లేదు. ఇతర పార్టీల మాదిరిగానే కాంగ్రెస్ పై కూడా తీవ్రస్థాయి విమర్శలే చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు.. ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి, కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారని ఎలా మాటివ్వగలరు..? పవన్ కల్యాణ్ అపరిపక్వ నాయకుడని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే… దాన్ని ఏకీభవిస్తూ చిరంజీవి మాట్లాడగలరా..? కాంగ్రెస్ పిలిచినా కూడా రాలేని పరిస్థితిలోనే చిరంజీవి ఉన్నారని చెప్పుకోవచ్చు.