ఈవారం మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. చిలసౌ, గూఢచారి, బ్రాండ్ బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే చిలసౌ, గూఢచారి మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. రెండూ ‘క్లాస్’ సినిమాలే. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని వీళ్లు టార్గెట్ చేయబోతున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఇద్దరు స్నేహితుల మధ్య ఈవారం బాక్సాఫీస్ వార్ చూడొచ్చు. ‘చిలసౌ’తో దర్శకుడిగా పరిచయం అవుతున్న రాహుల్ రవీంద్రన్, ‘గూఢచారి’ హీరో అడవిశేష్ ఇద్దరూ మంచి మిత్రులు. చిలసౌ కథంతా.. అడవి శేష్‌కి తెలుసు. ఆ సినిమా కోసం రాహుల్ పడిన కష్టాలు తెలుసు. గూఢచారి ఫైనల్ కట్ మొట్టమొదట చూసింది… రాహులే. ఇద్దరూ అంత మంచి స్నేహితులు. మరి ఈ వారం పోటీ పడుతున్నారు కదా? అని రాహుల్‌ని అడిగితే.. ”అవును. మేం 2నెల 27న రావాల్సింది. మల్టీప్లెక్స్‌లో సరైన థియేటర్లు దొరకలేదు. అందుకే ఆగస్టు 3కి వస్తున్నాం. అయితే అదే రోజు… నా స్నేహితుడి సినిమాకూడా ఉంది. రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వగానే ముందు ఫోన్ చేసింది అడవిశేష్కే. ‘ఏం ఫర్వాలేదు… మనిద్దరి సినిమాలు బాగా ఆడతాయి’ అన్నాడు. నేనేమో గూఢచారిని ప్రమోట్ చేస్తా. తనేమో.. ‘చిలసౌ’ని ప్రమోట్ చేస్తాడు. అలా.. మా స్నేహ ధర్మాన్ని మేం నిర్వర్తిస్తాం” అన్నాడు రాహుల్. మరి ఈ వారం.. ఈ ఇద్దరు మిత్రులలో ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందో చూడాలి.