కాపు కోటా పై జగన్ యూటర్న్ తీసుకోవడం, ఆ తర్వాత జగన్ పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత నెలకొనడం , జగన్ నిర్ణయాన్ని సమర్థించలేక వైఎస్సార్సీపీ కాపు నేతలు కిందామీదా అవడం- గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు. అయితే జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా, అదీ ముద్రగడ పద్మనాభం ఇలాకాలో ఈ నిర్ణయాన్ని ప్రకటించడానికి కారణాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా ఆయా నేతలు టీవీ చానళ్ల డిబేట్ లో మాట్లాడుతున్న దాన్నిబట్టి రెండు కారణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.
అద్దేపల్లి శ్రీధర్ జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ ఛానళ్లలో జరిగే డిబేట్లో పాల్గొంటూ ఉంటాడు. ఈయన జగన్ యు టర్న్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఒక ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ, జగన్ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రశాంత్ కిషోర్ ఆయనకు సూచించినట్టుగా తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉంది అని అద్దేపల్లి శ్రీధర్ బాంబు పేల్చాడు. దీనర్థం కాపు వోట్లు ఎలాగూ తమకి పడవు కాబట్టి వాటి మీద పూర్తిగా ఆశలు వదులుకొని కనీసం ఇతర ఓట్ల నైనా గంపగుత్తగా పడేలా చేసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ ఈ సలహాను గతంలోనే జగన్కు ఇచ్చినట్టుగా తమ వద్ద సమాచారం ఉంది అని అద్దేపల్లి శ్రీధర్ పేర్కొన్నాడు. ఇది మొదటి కారణం.
అయితే ఇది గతంలో ఎప్పుడో ఇచ్చిన సలహా అయినప్పటికీ ముద్రగడ ఇలాకాలోనే జగన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడానికి గల కారణాన్ని ముద్రగడ పద్మనాభం అనుచరుడు అయిన కటారి ఈశ్వర్ మరొక ఛానల్ డిబేట్ లో వివరించాడు. కృష్ణా జిల్లా కి చెందిన కాపు అధ్యక్షుడు కూడా అయిన కటారి ఈశ్వర్ మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా జగన్ ముద్రగడ పద్మనాభం కి ఫోన్ చేసినట్టు వెల్లడించాడు. ఫోన్ చేసిన జగన్, ముద్రగడ తనను ఆహ్వానించాల్సింది గా కోరినట్టు తెలుస్తోంది. అంటే తూర్పుగోదావరి జిల్లా యాత్రలో ఉన్న జగన్ ని ఆహ్వానిస్తూ ముద్రగడ ప్రకటన చేయగానే జగన్ ముద్రగడ ఇంటికి వెళ్ళి ఆయనతో కాసేపు భేటీ అవుతారన్నమాట. అయితే ఈ విన్నపాన్ని ముద్రగడ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ల గురించి స్పష్టమైన హామీ జగన్ నోటి వెంట నుండి వచ్చిన తర్వాతే జగన్ ని ఆహ్వానిస్తానని, జగన్ కాపు రిజర్వేషన్ల గురించి ప్రకటించకుండానే ఆయనను ఆహ్వానిస్తే తనకు చెడ్డపేరు వస్తుందని ముద్రగడ జగన్ కు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే తాను ఇచ్చిన ఆఫర్ ని ముద్రగడ తిరస్కరించడంతో జగన్ బాధ పడ్డాడని, ఆ కోపంతోనే మర్నాడే కాపు రిజర్వేషన్లకు సంబంధించి తాను ఏమీ చేయలేనని యూటర్న్ ప్రకటన చేశారని కటారి ఈశ్వర్ ఒక ఛానల్ డిబేట్ లో వెల్లడించాడు.
ఏదిఏమైనా, కారణాలు ఏవైనా , జగన్ తీసుకున్న యూటర్న్ వైఎస్ఆర్ సీపీకి చెందిన కాపు నేతలకు, అలాగే కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోని నేతలకు ఇబ్బందికర పరిస్థితి కలిగిస్తోంది.