కాపుల రిజర్వేషన్ల అంశమై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యల మీద ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పందించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల విషయమై జగన్ యూ టర్న్ తీసుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులను ఓట్లు అడిగే నైతిక అర్హతను కోల్పోయారన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో వైకాపాకి అర్థం కావడం లేని పరిస్థితి. జగన్ ను విమర్శించిన ముద్రగడపై ఆగ్రహం వ్యక్తం చేస్తే… అసలుకే మోసం తప్పదు! అలాగని, ఏమీ అనకుండా ఉంటే… ముద్రగడ చేసిన వ్యాఖ్యల ప్రభావం వైకాపాపై రాజకీయంగా చాలా పడుతుంది. అంతేకాదు, అధికార పార్టీకి అనుకూలంగా మారిపోతుందేమో అనే టెన్షన్. ఈ నేపథ్యంలో ముద్రగడ వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టిన వైకాపా నేత అంబటి రాంబాబు మాటల్లో ఈ సందిగ్దత అడుగడుగునా కనిపించింది.
ముందుగా, టీడీపీ మీద ఒంటికాలిపై లేచారు. కాపులకు చంద్రబాబు అన్యాయం చేశారనీ, అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, నాలుగేళ్లు జాప్యం చేశారన్నారు. మంజునాథన్ కమిటీ రిపోర్టు పూర్తిగా ఇవ్వకముందు హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేసేసి.. కేంద్రానికి పంపించేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఇక, ముద్రగడ విషయానికి వచ్చేసరికి… జగన్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. కాపుల ఉద్యమానికి మొదట్నుంచీ తాము మద్దతు ఇస్తున్నామనీ, తుని ఘటనలో ముద్రగడతోపాటు జగన్ పైనా, తనపైనా ఇతర నేతలపైనా కేసులు నమోదయ్యాయని అంబటి గుర్తుచేశారు. ఉద్యమంలో భాగంగా ముద్రగడను గృహనిర్బంధం చేసినప్పుడు, ఆయన కుటుంబాన్ని హింసలకు గురి చేస్తున్నప్పుడు మద్దతుగా వైకాపా నిలిచిందన్నారు. ముద్రగడకు మద్దతుగా పార్టీలకు అతీతంగా స్వర్గీయ దాసరి నారాయణరావు, చిరంజీవి వంటి ప్రముఖులతోపాటు వైకాపా కూడా వెంట నిలిచిందని ముద్రగడ గుర్తుచేసుకోవాలన్నారు.
ఇలానే, ముద్రగడకు వైకాపా ఇచ్చిన మద్దతునే ఈ సందర్భంగా గుర్తు చేసే ప్రయత్నం చేశారు అంబటి! అంతేగానీ… జగన్ యూటర్న్ తీసుకున్నారని అనడం దారుణమనీ, ఆయనకి ఓట్లడిగే నైతిక అర్హత లేదనడం అన్యాయమని సూటిగా ఖండించలేకపోయారు! మరో విషయం ఏంటంటే… కాపుల రిజర్వేషన్ల అంశమై టీడీపీ సర్కారు ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందనీ వారే చెబుతున్నారు. ఆ తీర్మానం పంపి ఇన్నాళ్లయినా కేంద్రం ఎందుకు స్పందించలేదనే ప్రశ్న వైకాపా వెయ్యదు..! గడచిన పార్లమెంటు సమావేశాల్లోగానీ, ఇప్పుడు రాజ్యసభలో మిగిలి ఉన్న ఎంపీగానీ.. కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్న కాపు రిజర్వేషన్ల అంశమై నిర్ణయం తీసుకోవాలంటూ మోడీ సర్కారు మీద తీవ్రమైన ఒత్తిడి పెంచేందుకు చేసిన ప్రయత్నం ఏదైనా ఉందా.. అంటే, వైకాపా దగ్గర సమాధానం లేదు.
ముద్రగడ మాదిరిగా ఇతర నేతలు ఎవరైనా జగన్ మీద వ్యాఖ్యలు చేసి ఉంటే.. వైకాపా నేతలంతా తీవ్రంగా మండిపడిపోయేవారు. కానీ, ఇప్పుడు అలా స్పందించలేకపోతున్నారు. ఎందుకనేది ప్రజలకు అర్థం కాని అంశం కాదు. అన్నిటికీ మించి, కాపుల రిజర్వేషన్లపై ఎవరు చేస్తున్న ప్రయత్నాలేంటో ప్రజలు గ్రహించలేని అంశం అంతకన్నా కాదు.