ఇప్పుడంతా కాపు రిజర్వేషన్ల గురించి చర్చే. కాపు రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతిస్తుందా లేదా.. అనేది కీలకమైన విషయం. భారతదేశంలో కాపులే కాదు.. రాజస్థాన్ లో జాట్లు, మహారాష్ట్రలో మరాఠాలు, గుజరాత్ లో పటేళ్లు…ఇలా వివిధ వర్గాలు రిజర్వేషన్లు కోరుతున్నాయి. జాట్ల కేసు తన ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మూడు అంశాలు చెప్పింది. అది కాపు రిజర్వేషన్లకు కూడా వర్తిస్తుంది.
రాజకీయ ప్రాబల్యంతో రిజర్వేషన్లు ఇప్పించుకోలేరు..!
జాట్ కేసుగా ప్రసిద్ధి పొందిన కేసులో సుప్రీంకోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్యలు కాపు రిజర్వేషన్ల వివాదానికి కూడా వర్తిస్తాయి. ఒక పొలిటికల్లీ ఆర్గనైజ్డ్ క్యాస్ట్..రాజకీయ ప్రాబల్యం ఉన్న కులం.. తమ రాజకీయ ప్రాబల్యాన్ని ఉయోగించుకుని.. రిజర్వేషన్లు పొందితే.. అది సమాజంలో ఉన్న బలహీనమైన … వారి స్థాయిలో ప్రాబల్యం లేని కులాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. జాట్లు బలమైన రాజకీయ శక్తిగా ఉన్నారు. కాపులు కూడా అంతే. దాదాపుగా 35 సీట్లలో వారు గెలుపోటముల్ని నిర్ణయిస్తారు. ఎవరు అధికారంలో ఉండాలని నిర్ణయించే స్థాయిలో వారున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చాలా కీలకం. ఒక రాజకీయ శక్తిగా ఉన్న వర్గం.. తమ బలంతో రిజర్వేషన్లు ఇప్పించుకుంటామంటే.. న్యాయవ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషించదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరైనా తమకు తాముగా వెనుకబడ్డామని చెప్పుకుంటే సరిపోదు. తనకన్నా బాగున్నవారు రిజర్వేషన్ పొందుతున్నారు.. మాకెందుకు వద్దు అనే వాదన కూడా కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదు..!
అదే సమయంలో సుప్రీంకోర్టు ఇంకొక్క మాట కూడా చెప్పింది. అసలు కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొచ్చా..?. భారత రాజ్యాంగంలో వెనుకబడిన కులం అన్నారు .. కానీ కులం అనలేదు. కాపు రిజర్వేషన్ల డిమాండ్ కు ప్రాతిపదిక కులమే కదా.. ఆ కులాన్ని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. 1960ల్లోనే సుప్రీంకోర్టు.. కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ బద్ధం కాదు అని తీర్పు చెప్పింది. తర్వాత ఈ తీర్పును కొద్దిగా సవరించింది. కులం ఒక్కదాన్నే రిజర్వేషన్ కోసం చూడుకుండా.. అనేక అంశాలను చూడాలని సుప్రీంకోర్టు సూచించింది. రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న వర్గం.. వెనుకబడిన వర్గంగా ఉందా అని గుర్తించడానికి కులం అనే కొలబద్దను తీసుకోవచ్చు కానీ కులం ఆధారంగానే రిజర్వేషన్లను గుర్తించలేమని…సుప్రీంకోర్టు ఇందిరా సహానీ కేసులో తీర్పు చెప్పింది. రామ్ సింగ్ వర్సెస్ జాట్ కేసులోనూ.. సుప్రీంకోర్టు ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. వెనుకబాటు తనాన్ని గుర్తించడానికి కులం ఓ కొలబద్దే కానీ.. కులమే ఆధారంగా.. వెనుకబాటు తనాన్ని నిర్ధారించకూడదని స్పష్టం చేసింది.
అత్యంత అణగారిన వర్కాలకే రిజర్వేషన్లు..!
కాపుల రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఇదే సుప్రీంకోర్టు తీర్పులోని సారాంశం. అయితే… వెనుకబాటుకు గురయితే రిజర్వేషన్లు ఇవ్వొచ్చు. వెనుకబాటు తనం అంటే ఏమిటి..?. సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటు తనాన్ని మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేట్ చేసి..చెప్పడం వెనుకబాటు తనం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయాన్ని పొందేవాళ్లు సమాజంలో..అత్యంత అణగారిన వర్గాలై ఉండాలి. ఈ అత్యంత అణగారిన వర్గాలకు కాకుండా.. ఇంకెవరికైనా రిజర్వేషన్లు కల్పిస్తే.. ఆయా ప్రభుత్వాలు తమ రాజ్యాంగ బద్ధమైన విధుల నుంచి తప్పించుకున్నట్లేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే చాలా క్లియర్గా కులం ఒక్కటే రిజర్వేషన్లకు ప్రాతిపాదిక కాదని స్పష్టమవుతుంది. అలాగే వెనుకబాటుకు గురయ్యారని ఏవో లెక్కలేసి రిజర్వేషన్లు ఇవ్వలేరు కూడా.
రిజర్వేషన్లు ఇచ్చినా కోర్టుల్లో నిలబడవు..!
కాపు రిజర్వేషన్లు ఇవ్వడానికి మంజునాథ కమిషన్ వేశారు. మన దేశంలో మొదట రిజర్వేషన్లు ఇవ్వాలంటే మొదట రాజకీయ నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత కమిషన్ వేస్తారు. ఆ కమిషన్ ఆ వర్గం వెనుకబాటు తనానికి గురయిందంటే… అప్పుడు రిజర్వేషన్లకు సిపార్సు చేస్తారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో .. రిజర్వేషన్లు ఇవ్వాలనుకునే.. కమిషన్ వేస్తున్నారు. ఏపీలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నారు. ఇవ్వాలి కాబట్టి..రాజ్యాంగపరమైన ప్రక్రియను చూపెట్టాలి కనుక కమిషన్ వేశారు.ఆ కమిషన్ వెనుక బడిందని చెబుతుంది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లపైనా అదే పని చేశారు.ఇది భారత సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఆంధ్రప్రదేశ్ లో కాపులు అత్యంత అణగారిన వర్గాలు కాదు. కాపుల్లో వెనుకబాటు తనం ఉన్న మాట నిజం. దశాబ్దాలుగా కాపులకు రాజకీయ పార్టీలు వివిధ హామీలిచ్చి అమలు చేయకపోవడం నిజం. అదే సమయంలో ఈ కారణంగా… కాపులను అత్యంత అణగారిన వర్గంగా నిర్ణయించలేము.
రాజకీయ పార్టీలు భ్రమలు కల్పిస్తున్నాయి..!
అత్యంత అణగారిన వర్గాలకే.. రిజర్వేషన్లు ఇవ్వాలంటున్న సుప్రీంకోర్టు.. ఈ రిజర్వేషన్లను అంగీకరించడం లేదు. రాజకీయ పార్టీలన్నింటికీ సుప్రీంకోర్టు తీర్పుల గురించి తెలుసు. కానీ వాళ్లు రాజకీయం చేస్తారు. మొదట రిజర్వేషన్లు ఇస్తారు. మేము ఇచ్చాం అని ఓట్లేయించుకుంటారు. తర్వాత కోర్టు కొట్టి వేస్తుంది. దాంతో ఎక్కడివక్కడ ఉండిపోతాయి. అలాగే సుప్రీంకోర్టు రిజర్వేషన్లకు మించ కూడదని పరిమితి పెట్టింది. దీన్ని కూడా రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు. రాజ్యాంగంలోని షెడ్యూల్ నైన్ లో పెట్టిస్తామని చెబుతున్నారు. మరి ఇంత కాలం ఎందుకు పెట్టించలేకపోయారు. దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు ఈ భ్రమలు సృష్టించాయి.