కాపుల రిజర్వేషన్లపై జగన్ కామెంట్లు రాజకీయంగా సమీకరణ మార్పునకు దారి తీసేట్టే కనిపిస్తున్నాయి. జగన్ ఇలా వ్యాఖ్యానించేందుకు కారణం ప్రశాంత్ కిషోర్ సలహాయే కారణమంటున్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇంతకీ జగన్ వ్యూహమేంటంటే… గోదావరి జిల్లాల్లో ఇప్పట్నుంచే జాగ్రత్తపడటం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైకాపా విజయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినవి గోదావరి జిల్లాలు. కాబట్టి, ఇప్పట్నుంచీ ఆయా జిల్లాలపై ఒక స్పష్టమైన వైఖరి అవలంభించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. పవన్ ప్రభావంతో ఎలాగూ అక్కడ ఓట్ల చీలిక తప్పదు. ఇక మిగిలిన కులాలూ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి, తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే ఈ కామెంట్ల వెనక జగన్ వ్యూహం కావొచ్చనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది.
గోదావరి జిల్లాలో కాపుల రిజర్వేషన్లకు శెట్టి బలిజలు కొంత వ్యతిరేకరంగా ఉన్నారు. వారికి పార్టీలో ప్రాధాన్యత పెంచాలన్నది వైకాపా భావిస్తోందని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వీలైతే శెట్టి బలిజలకే అధికంగా సీట్లిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు! దీంతోపాటు కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఇతర వర్గాలు, టీడీపీకి మద్దతుగా ఉంటున్న బీసీల్లో కొందర్ని చీల్చడం ద్వారా లబ్ధి పొందచ్చనే అంచనా ఉందట! ఇలాంటి ఆలోచన ఉంది కాబట్టే, గోదావరి జిల్లాలో ఉండగా కాపుల రిజర్వేషన్లపై జగన్ ఈ తరహా ప్రకటన చేశారని అంటున్నారు.
ఇంకోటి ఏంటంటే.. తూర్పు గోదావరి జిల్లాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించిన దగ్గర్నుంచీ కాపుల నుంచి ఒత్తిడి బాగా ఎక్కువైందని సమాచారం. ‘కాపుల రిజర్వేషన్లపై వైకాపా స్పష్టమైన వైఖరి ఏంటి’ అంటూ ప్లకార్డులు జగన్ యాత్రలో కనిపించడం మొదలైంది. అయితే, తను వెళ్తున్న మార్గంలోని కాపు నేతలతో చర్చించి, పాదయాత్రలో ఇలాంటి నిరసనలు వద్దన్నట్టుగా నచ్చజెప్పారని తెలుస్తోంది! కానీ, జగ్గంపేట వచ్చేసరికి… పవన్ పై కాపు వర్గం వారి ఒత్తిడి ఎక్కువైందనీ, రిజర్వేషన్లపై స్పష్టంగా ఏదో ఒకటి చెప్పి తీరాలని పట్టుబట్టారని సమాచారం. దీంతో ఆయనకి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
ఏదేమైనా, జగన్ ప్రకటనపై గోదావరి జిల్లాలో తీవ్రమైన చర్చే జరుగుతోంది. ఉద్యమం ప్రాణం పోసుకున్న ప్రాంతంలో రిజర్వేషన్లకు ప్రతికూలంగా జగన్ ప్రకటన చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మన బడ్జెట్ లో సాధ్యమౌతుందా లేదా అనే ఆలోచన లేకుండా సంక్షేమ పథకాలంటూ జగన్ హామీలు ఇస్తున్నారుగానీ, తమ రిజర్వేషన్ల అంశంపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేకపోయాన్న అభిప్రాయం ఆ జిల్లాల ప్రజల్లోకి బలంగా వెళ్లినట్టు సమాచారం. కులాల మధ్య విభజన తేవడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నదే వైకాపా వ్యూహమైతే, అంతకంటే దారుణమైనది మరొకటి ఉండదనే చెప్పాలి.