నిజాయితీగా జీవించడంలో అందాన్ని, నీతిగా బతకటంలోని సొగసును, గౌరవాన్ని, సంతృప్తికరమైన ఆత్మిక ఉత్తేజాన్ని చూపించే కళలు మాయమైపోయాయి. ఆదివారం అంటే ఆటవిడుపు, సండే ఫన్ డే అనుకోవడమే తప్ప, మూవీ, టివి, ఈటౌట్ తప్ప, అందులో పైపైనే పాకిపోయే టైంపాస్ తప్ప ఏ ఆనందమూ మనుషుల లోపలికి ఇంకడం లేదు.
సర్వకళల సమాహారమైన తెలుగు సినిమాను చూడండి. అది నేల విడిచి లార్జర్ దాన్ లైఫ్ సైజులో సాము చేస్తోంది. ఫక్తు వ్యాపారమే తప్ప ‘కళ’ అన్న మాటకు తగని విధంగా తెలుగు సినిమా ఓ పేలవమైన, రసహీనమైన అనుకరణగా మిగలిపోయింది. ఎనిమిది దశాబ్దాల పైబడిన చరిత్ర కలిగిన తెలుగు చిత్రరంగం నుంచి ఎన్ని జాతీయ ఉత్తమ చలన చిత్రాలు వచ్చ్చాయో ఆలోచిస్తే మన సినిమా డొల్లతనం బయట పడుతుంది.
టీవీ కూడా ప్రధానంగా సినిమా ప్రమోషనల్ ఫీచర్లు యాడ్స్ మీదనే ఆధారపడిన మీడియా కాబట్టి సినిమాలో లేని సృజనాత్మకతను టివిలో ఆశించలేము.
మానవజాతి వికాసంతో పాటు కళలు, సంస్కృతి కూడా వికసించాయి. జీవన పోరాటంలో ఆదిమానవుడు పడ్డ ఘర్షణ నుండి కళలు ఆవిర్భవించాయి.వాటికి మనిషి భౌతిక జీవనంతో విడదీయలేని సంబంధం ఉంది. మనిషి మానసికోద్వేగాలను ఉపశమింపజేసే క్రమంలో ఈ కళలకు చోటు లభించింది. కళలు మనుషుల్లో క్రమశిక్షణను పెంచాయి. హదయ సంస్కారాన్ని వికసింపచేశాయి.
నీతి, నిజాయితీ, విలువలు మానవ జీవితంలో అంతర్భాగాలు…మానవీయతను ఉద్దీపింపజేసే లక్షణాలు. దైనందిన జీవితంలోని అలవాట్లు, అభిరుచులు, ఆశలు, ఆకాంక్షలు నైతిక విలువలను నిర్దేశిస్తాయి. బతుకు నడక తీరును చెప్పకనే చెబుతాయి. మంచీచెడుల్ని అలవరుస్తాయి. మరీ ముఖ్యంగా అభిరుచి స్థాయి నైతిక విలువలను నిర్దేశిస్తుంది. కూడు, గూడు, గుడ్డతోబాటు మనిషికి జీవితంలో వినోదం, ఆనందం కూడా ముఖ్యమే.
పరిశ్రమలో, పొలంలో శరీరకష్టంతో పనిచేసిన మనుషుల వినోద ఆనందాలు వేరు. చెమటపట్టకుండా పనిచేసే వారి వినోద ఆనందాలు వేరు. ఒక టెక్నాలజీ విస్పోటనం నుంచి పుట్టి ఇళ్ళల్లో వ్యాపించిన టెలివిజన్ ఈ రెండురకాల మనుషుల్లోనూ చెమటపట్టని వారి వినోదాలనే ప్రసారం చేయడం మొదలు పెట్టింది. రెండు తరాలు గడిసేసరికి ప్రజలందరికీ మూసపోసిన వినోదమే మిగిలింది.
ప్రజల్లో చిత్రకళ, శిల్పం, సంగీతం, నాటకం, సాహిత్యం వంటి రంగాలపై ఆసక్తి, అనురక్తి, అభిరుచి తగ్గిపోతుండడం విషాదం. పల్లెపట్టుల్లో ఉండే శ్రమైక జీవుల సజనాత్మక కళలు సైతం అవసాన దశకు చేరుకున్నాయి. గొల్లసుద్దులు, హరికథలు, బుర్రకథలు, యక్షగానాలు మటుమాయమయ్యాయి. నాటకాన్ని ప్రదర్శించే థియేటర్లు పట్టణాల్లో లేవు.
మనుషుల నైసర్గికతతో, జీవనంతో తెలుగు సినిమాకు సంబంధం లేదు. ఇలాంటి సినిమా ఏ విలువల్ని ప్రబోధిస్తుంది? ఏ అభిరుచుల్ని ప్రోది చేస్తుంది? మానవీయ కోణాలను ఎలా చూపుతుంది? ఒక మంచి సంగీతం, చిత్రకళ, శిల్పం, నత్యం వంటి ప్రదర్శనలు జనాలకు ఎందుకు దగ్గర కాలేకపోతున్నాయి? ఆ అభిరుచి తెలుగు వాళ్ళకు లేదా? తెలుగువాళ్ళను ఆకర్షించే సజనాత్మక కౌశలం ఆయా కళలను ప్రదర్శించే సంస్థలకూ, వ్యక్తులకూ లేదా? ఆలోచిస్తే, నిట్టూర్పులే సమాధానాలౌతున్నాయి.