కాపు రిజర్వేషన్ల పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట మార్చారు. ఎప్పుడూ యూటర్న్ తీసుకోలేదని చెబుతూ.. రిజర్వేషన్ల అంశానికి తన మద్దతు ఉంటుందని స్పష్టంగా ప్రకటించారు. కాపు రిజర్వేషన్లపై తన మాటలను వక్రీకరించారని పిఠాపురంలో జగన్ చెప్పుకొచ్చారు. చెప్పిన మాటను ఎన్నడూ తప్పనని గంభీరంగా ప్రకటించారు. బీసీలకు అన్యాయం జరగకుండా… కాపులను బీసీల్లో చేర్చాలన్న వైఖరిలో మార్పులేదన్నారు. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో .. మొక్కుబడిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోనివని.. తాను ఏమీ చేయలేనని జగన్ చెప్పిన తర్వాత.. ప్రతీ రోజూ పాదయాత్రలో నిరసనలు ఎదురవుతున్నాయి. కాపు సామాజికవర్గంలో స్పందన వ్యతిరేకంగా ఉండటంతో .. జగన్ వక్రీకరణ వాదాన్ని ఎంచుకున్నారు.
జగ్గంపేటలో కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటన.. ఓ రకంగా రాష్ట్రంలో రాజకీయ సంచలనం రేపింది. సమీకరణాలను మార్చేస్తుందని అందరూ నిర్ణయానికి వచ్చారు. దానికి తగ్గట్లుగానే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఊహించని విధంగా నేరుగా విమర్శలు గుప్పించారు. ఇది జగన్ లో కలవరానికి గురి చేసింది. అదే సమయంలో తన ప్రకటన బీసీల ఆలోచనల్లోనూ పెద్దగా మార్పు తీసుకు రావడం లేదన్నఫీడ్ బ్యాక్ వైసీపీకి అందింది. జగన్ ప్రకటనను సమర్థించేలా.. ప్రెస్ మీట్లు నిర్వహించాలని కాపు నేతలకు చేస్తున్న సూచలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో.. జగన్ ప్రకటన చేసిన తర్వాతి రోజు నుంచే… ఆ పార్టీ నేతలు జగన్ మాటలను వక్రీకరించారంటూ… కొత్త వాదన ప్రారంభించారు. జగన్ మీడియా కూడా దీనికే ప్రాధాన్యత ఇచ్చింది. కురసాల కన్నబాబు దగ్గర్నుంచి అంబటి రాంబాబు వరకూ.. వక్రీకరణ వాదమే వినిపించారు. ఇప్పుడు నేరుగా జగనే ఆ మాటలు చెప్పుకొచ్చారు.
కాపు రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉందని తప్పించుకోవడం.. ప్రజల్లోకి చేతకానితనంగా వెళ్లిందన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర పరిధిలో ఉన్న విభజన చట్టం హామీల కోసం పోరాడుతున్నట్లు చెప్పుకుంటున్నందున.. దీని కోసం ఎందుకు పోరాడరని.. కాపు నేతలు ప్రశ్నించడం ప్రారంభించారు. అదే సమయంలో గతంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉద్రిక్త స్థాయికి చేరినప్పుడు తను చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వీడియోలు విస్త్రతంగా ప్రచారంలోకి వచ్చాయి. అందుకే.. తాను కాపు రిజర్వేషన్లు ఇవ్వలేనని చెప్పాను.. కానీ.. రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదంటూ..కొత్త వాదన ప్రారంభించారు. నిజంగా… తన ఉద్దేశం అదే అయితే.. వివాదం రేగిన తర్వాతి రోజే ప్రకటించి ఉండేవారని.. ఐదు రోజుల తర్వాత స్పందించాల్సిన అవసరం ఏమిటని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి మాటతప్పని..మడమ తిప్పని.. నేత జగన్.. మళ్లీ తూచ్ అన్నారు. తన మొదటి వాదనకే కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు.