అసోంలో దాదాపు 40 లక్షల మంది భారతీయ పౌరులు కాదంటూ ఒక జాబితాను కేంద్రం తయారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంతమంది భవిష్యత్తు ఏంటనేది చర్చనీయం అవుతోంది. వీరికి ముందుగా ఓటరు గుర్తింపు కార్డుల దగ్గర నుంచీ ప్రభుత్వం ఇచ్చే అన్నిరకాల సదుపాయాలూ ఒక్కోటిగా పోవడం ఖాయమంటున్నారు. దీంతో వీరి ఎటువెళ్తారు అనేది చర్చ! ఇదే అంశం రాజ్యసభలో కూడా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. ఇదంతా భాజపా చేస్తున్న రాజకీయమే అంటూ కాంగ్రెస్ తీవ్రంగా ధ్వజమెత్తింది. ప్రస్తుతం అసోంలో జరిగినట్టుగానే, తరువాత పశ్చిమ బెంగాల్ లో కూడా ఇలాంటి ప్రక్రియ ఉంటుందని ఇప్పటికే కేంద్రం సంకేతాలు ఇస్తోంది.
దీంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో రక్తపాతం తెచ్చే విధంగా భాజపా తీరు ఉంటోందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సివిల్ వార్ వారి వల్లే వస్తుందేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి, అశాంతికి కారణమౌతున్నారని ఆమె మండిపడ్డారు. ఎవరైనా భారతీయులా కాదా అని నిర్ణయించడానికి వారెవరు, కేవలం భాజపాకి మద్దతు ఇచ్చేవారే భారతీయులా, మిగతావారు కాదా అంటూ మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మమతా వ్యాఖ్యలపై భాజపా అధ్యక్షుడు అమిత్ షా కూడా అంతే తీవ్రంగా స్పందించారు. భారతీయుల హక్కులను కాపాడేందుకు తీసుకున్న చర్యల్లో భాగమే ఇదనీ, ఇలాంటి పనిచేస్తున్నందుకు అన్ని పార్టీలకు తమకు మద్దతు ఇవ్వాలని అమిత్ షా అన్నారు. సివిల్ వార్ లాంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను మమతా బెనర్జీ తప్పుతోవపట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభద్రత విషయంలో కూడా ఆమె ఓటు బ్యాంకు పాలిటిక్స్ చూసుకుంటున్నారన్నారు. భారతీయుల హక్కుల్ని కాపాడటమే తాము చేస్తున్న తప్పా అంటూ మమతను ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంటోంది. అంతేకాదు, ఈ ఇష్యూని అడ్డం పెట్టుకుని ముస్లింలను భాజపా టార్గెట్ చేసుకుంటోందనే చర్చకు ఆస్కారం ఉంది. దాని ప్రభావం మరోలా ఉండే ఛాన్సులూ లేకపోలేదు.
అయితే, వీళ్లందరి విషయంలో ఓ నెలపాటు కోర్టు టైమిచ్చింది. ఈలోగా వారు ధ్రువీకరించుకుని, రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆ గడువు దాటినా కూడా రిజిస్టర్ కాని వారి భవిష్యత్తు ఏంటనేదే పెద్ద ప్రశ్న..? అమిత్ షా ఆవేశం చూస్తుంటే వారిని దేశం నుంచి బయటకి పంపేస్తారేమో అనే అనుమానం కలుగుతోంది. అయితే, వీరిని తమ పౌరులుగా బంగ్లాదేశ్ కూడా ఒప్పుకోవాలి కదా! ఇదే అంశమై ఇప్పటికే విదేశాంగ శాఖ కూడా బంగ్లాదేశ్ తో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వారు తమ పౌరులు ఎలా అవుతారనే వాదనను బంగ్లాదేశ్ వినిపిస్తోందట. దీంతో అటూఇటూ కాకుండా పోతే వీరు ఏమౌతారనేదే ప్రశ్న..? చూస్తుంటే, ఈ సమస్య మరింత పెద్దదిగా మారుతుందేమో అనిపిస్తోంది.