రాజకీయాల్లో విషయ పరిజ్ఞానం ఉన్నా లేకున్నా.. ముందు లౌక్యం ఉండాలి. ఏం చేసినా తనను తాను సమర్థించుకునే నైపుణ్యం ఉండాలి. ఏదైనా సమస్యపై… నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు…సమయస్ఫూర్తి ప్రదర్శించాలి. అంతే కానీ.. పారిపోతాను … అంటే.. అది విజయవంతమయ్యే రాజకీయ నాయకుల లక్షణం కాదు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పుడీ విధానమే ఎంచుకుంటున్నారు. మేధావులతో చర్చల పేరుతో.. సమస్యలన్నింటిపై స్పందించడానికి సిద్ధపడటం లేదు. చివరికి కాపు రిజర్వేషన్ల అంశంలోనూ అదే దాటవేత ధోరణి అవలంభించారు.
రాజకీయాల్లో ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా… కులం ప్రకారమే పార్టీలకు ఓటు బ్యాంక్ ఏర్పడుతుంది. టీడీపీకి ఓ ప్రధాన సామాజికవర్గం, వైసీపీకి మరో ప్రధాన సామాజికవర్గం అండగా ఉంటాయి. పవన్ కల్యాణ్‌ను కూడా.. ఓ మెయిన్‌స్ట్రీమ్ పోటీ దారుగా అందరూ ఎందుకు పరిగణిస్తున్నారంటే.. తన సామాజికవర్గమే కారణం. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు తెలియకుండానే రాజకీయాలు చేస్తున్నారని అనుకోలేం. మరి అలాంటప్పుడు.. తనకు అండగా ఉంటుందని భావిస్తున్న సామాజికవర్గానికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు.. ఎంత అడ్వాంటేజ్ తీసుకోవాలి..? ఏక పక్షంగా ఇతరులను శతృవులను చేసుకుంటున్నట్లు కాకపోయినా… మీకు నేనున్నా అనే భావన కల్పించగలిగాలి. అది రాజకీయ నాయకుని లక్షణం. కానీ పవన్ కల్యాణ్.. పూర్తిగా చేతులెత్తేశారు. మిగతా రెండు ప్రధాన పార్టీలే గేమ్ ప్రారంభించినా.. ఆ రెండు పార్టీలకు ఉన్న స్పష్టత కూడా పవన్ కల్యాణ్‌కు లేకుండా పోయింది.
కాపు రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నానని.. ప్రకటించుకోవడానికి పవన్ కల్యాణ్‌కు వచ్చిన అడ్డం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. కాపు రిజర్వేషన్లు ప్రకటించారు. తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా.. మాట తప్పినా.. మడమ తిప్పినా.. చివరికి తన మద్దతు ప్రకటించారు. వీరిద్దరూ కాపుల ఓట్ల కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తూంటే.. అసలు రిజర్వేషన్లు అవసరమా లేదా.. అన్నదానిపై మేధావులతో చర్చిస్తానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లపై జనసేన ప్రకటన.. ఒక్కసారిగా కాపు యువతను కూడా ఆలోచనలో పడేసింది.
వాస్తవానికి కాపు రిజర్వేషన్లకు మద్దతు ప్రకటిస్తే.. తీవ్రంగా వ్యతిరేకించే వర్గాలు కూడా లేవు. బీసీ రిజర్వేషన్లు తగ్గించే ప్రశ్నే లేదని.. వారికి విడిగా.. కోటా పెట్టాలనే ప్రభుత్వం సిఫారసు చేసింది. ముద్రగడ పద్మనాభం కూడా.. బీసీల రిజర్వేషన్లు కావాలని ఆడగడం లేదని స్పష్టం చేశారు. అందుకే బీసీల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. పవన్ కల్యాణ్ రిజర్వేషన్లకు అనుకూలంగా ప్రకటన చేసినా.. వ్యతిరేకించేవారెవరూ ఉండరు. కానీ పవన్ మాత్రం డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. మద్దతుగా ఉంటుందనుకున్న సామాజికవర్గంలోనే పలుచన అయ్యారన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలోనే మద్దతు తెలియజేయకపోతే.. తర్వాత అండగా ఉంటారన్న గ్యారంటీ ఏమిటన్న ఆలోచన కాపు సామాజికవర్గంలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.