హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఇవాళ నిర్వహిస్తున్న కాపు రిజర్వేషన్ సభలో గందరగోళం చోటుచేసుకుంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతుండగా, సభలో దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా ఫోటో పెట్టలేదంటూ కొందరు అడ్డుపడ్డారు. రఘువీరా వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినలేదు. దీనితో, మీడియా దృష్టిని ఆకర్షించటంకోసమే కొందరు హడావుడి చేస్తున్నారంటూ రఘువీరా మండిపడ్డారు.
అంతకుముందు రఘువీరా తన ప్రసంగంలో కాపులను ఓటు యంత్రాలుగా చూస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుధ్ధి ఉంటే వారిని బీసీల్లో ఎందుకు చేర్చటంలేదని ప్రశ్నించారు. తమ ఉద్యమంలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. కాపులను బీసీల్లో చేర్చే విషయంలో టీడీపీది రెండుకళ్ళ సిద్ధాంతమని ఎద్దేవా చేశారు. ఈనెల 31న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపు గర్జన పేరుతో తునిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సభకు ఇప్పటికే కాంగ్రెస్, వైసీపీ మద్దతు ప్రకటించాయి. టీడీపీ కాపునాయకులు ముద్రగడ సభపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాపులు టీడీపీ వైపు ఉన్నారనే ఉద్దేశ్యంతో వైసీపీ కుట్రచేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.