బిచ్చగాడుతో ఒక్కసారి తెలుగులో తన మార్కెట్ పెంచేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. అంతకు ముందు తీసిన నకిలీ, డాక్టర్ సలీమ్ చిత్రాలు కూడా మంచి కాన్సెప్ట్‌తోనే సాగడంతో… విజయ్ ఆంటోనీపై గురి పడింది. అయితే… ఆ తరవాత అతని సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టడం ప్రారంభించాయి. కొత్తదనాన్ని పక్కన పెట్టి, మాస్ కమర్షియల్ కథల్ని నమ్ముకోవడం.. బెడసి కొట్టింది. తెలుగులో విజయ్ సినిమాని డబ్ చేయడానికి, పంపిణీ చేయడానికి ఎగబడిన వాళ్లంతా ఇప్పుడు క్రమంగా వెనుకడుగువేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతన్నుంచి మరో సినిమా వస్తోంది. తమిళంలో ‘తిమిరపుడిచవాన్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘రోషగాడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. చిరంజీవి హీరోగా ఎదుగుతున్న క్రమంలో వచ్చిన చిత్రాల్లో ‘రోషగాడు’ ఒకటి. 1983లో విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది. మరి ఈ టైటిల్ విజయ్కైనా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. నివేథా పేతురాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి గణేష్ దర్శకుడు.