తాజాగా జరుగుతున్న సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల దాడి పెంచుతున్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని సూటిగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న.. జగన్ చేస్తున్న పాదయాత్రలో చిత్తశుద్ధి లేదనీ, రోజుకి ఒకటో రెండో కిలోమీటర్లు మాత్రమే నడుస్తారన్నారు. ఇవాళ్ల అనంతపురంలో జిల్లాలో జరిగిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకాపా, భాజపాలపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భాజపా నమ్ముకుందన్నారు. అలాంటి పార్టీని నమ్ముకుని వారు నీతులు వల్లిస్తున్నారన్నారు.
దేశవ్యాప్తంగా అవినీతిని ప్రక్షాళన చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఎన్నికలకు ముందు చెప్పారన్నారు. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందనీ, స్విస్ బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మూలుగుతోందనీ, ఆ సొమ్మును తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలు చొప్పున వేస్తామనీ, అవినీతిపరుల ఆస్తుల్ని జప్తు చేసి, వారిపై ఉన్న కేసుల్ని సంవత్సరంలోపల ఒక కొలీక్కి తీసుకొస్తామని చెప్పారన్నారు. ‘నేను అడుగుతున్నా… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేసులు మీకు కనబడలేదా?’ అంటూ ప్రధానిని ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఎ1, ఎ2లను కూర్చోబెట్టుకునే పరిస్థితి ఉందన్నారు. ఇలాంటివారిని పక్కనపెట్టుకుని అవినీతిని ఎలా కంట్రోల్ చేస్తారన్నారు. వీళ్లకు రాజకీయం మాత్రమే కావాలనీ, మనకు ప్రజాహితం కావాలన్నారు.
తాను ఓపిగ్గా ప్రయత్నిస్తాననీ, పోరాడాల్సి వస్తే ఎవ్వరైనా తన తరువాతే తప్ప ఇంకొకరు పోరాడలేరని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరి వల్ల అయితే రాష్ట్రం బాగుపడుతుందో అని గత ఎన్నికలకు ముందు ప్రజలంతా ఆలోచించారనీ, తాను తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరని తనకు ప్రజలు తనకు సహకరించారని సీఎం చెప్పారు. అందుకే, కొన్ని సందర్భాల్లో తాను తగ్గుతూ వచ్చాననీ, ఎప్పుడైతే కేంద్రం ఏమీ చెయ్యదన్నది స్పష్టమైపోయిందో.. పోరాటానికి కూడా వెనకాడలేదని చంద్రబాబు చెప్పారు.
ఈ మధ్య సీఎం చంద్రబాబు తాజా ప్రసంగాల్లో రెండు విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది… ప్రతిపక్ష నేత జగన్ పై నేరుగా విమర్శలు చేస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్ర, ఆయనపై ఉన్న కేసుల్ని తరచూ గుర్తుచేస్తున్నారు. అదే సమయంలో వైకాపా భాజపాలు కలిసి ముందుకు సాగుతున్నాయనే అభిప్రాయాన్ని పదేపదే వ్యక్తం చేస్తున్నారు. ఇక, రెండోది… వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటెయ్యాలనే దిశగా ప్రజల ఆలోచనల్ని ప్రభావితం చెయ్యడం! 2014 నాటి వాతావరణాన్ని గుర్తు చేస్తూ… రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమని ప్రజలు నమ్మారని పదేపదే గుర్తుచేస్తున్నారు. తద్వారా మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రయోజనాల కోసం బలంగా నిలబడగలదనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నమూ చేస్తున్నారనీ చెప్పుకోవచ్చు.