చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం అందరి దృష్టిని ఆకర్షించేలా జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి, బైరెడ్డి వంటి నాయకుల చేరికతో … ప్రత్యేకహోదా, కాపు రిజర్వేషన్ల ఉద్యమాలతో కలసి వస్తున్న పరిణామాలు ఆ పార్టీకి జవసత్వాలు కూడదీసుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఈ అవకాశాల్ని వినియోగించుకునేందుకు విజయవాడలో జరిగిన సర్వసభ్య సమావేశంలో.. కాస్త గట్టిగానే మేథోమథనం జరిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. సహజంగానే కిరణ్ వ్యూహం… వైసీపీని దెబ్బకొడితేనే.. కాంగ్రెస్ బలం పుంజుకుంటుందని… వైసీపీకి మళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంకులు తిరిగి కాంగ్రెస్ కు వస్తాయనే వాదన వినిపించారు. దీనికి సగం మంది నేతలు సమర్థింపుగా మాట్లాడారు. అయితే సగం మంది నేతలు మాత్రం అధికారపక్షాన్ని టార్గెట్ చేయాలన్నారు.
వైసీపీని టార్గెట్ చేయాలన్న అభిప్రాయం వినిపించినప్పుడు అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించకుండా పార్టీ ఎలా బలోపేతం అవుతుందని కొంత మంది నేతలు గట్టిగానే ప్రశ్నించారు. వారందరికి సర్దిచెప్పిన ఊమెన్ చాందీ… వైసిపిని ప్రధమ శత్రువుగా భావించి టార్గెట్ చేయడంతో పాటు … తెలుగుదేశానికి కూడా సమ దూరం పాటించాలని ఆదేశించారు. తెలంగాణాలో తెలుగుదేశంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని వార్తలను కొంత మంది చాందీ దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి చర్చలేమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీని టార్గెట్ చేసి ఓటు బ్యాంకును పునరుద్దరించుకోవడం కోసం.. ప్రత్యేకహోదా, కాపు రిజర్వేషన్లపై జగన్ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. చిరంజీవి అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.రాహుల్ తో ఒత్తిడి చేసి అయినా సరే చిరంజీవిని కాంగ్రెస్ లో మళ్లీ క్రియాశీలకం చేయాలని కొంత మంది నేతలు చాందీకి సూచించారు. అలా అయితే పవన్ కు కూడా చెక్ పెట్టవచ్చన్నారు.
ప్రత్యేకహోదా, కాపు రిజర్వేషన్ పై స్పష్టమైన హామీ ఇవ్వడం ద్వారా వాటిని అమలు చేసే అవకాశం జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంటుందని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. జగన్ ను టార్గెట్ చేయడం వల్ల పార్టీ క్యాడర్ లీడర్లను తమ వైపుకు తిప్పుకోవడం, చిరంజీవిని క్రియాశీలకం చేయడం ద్వారా పవన్ ను డిఫెన్స్ లో పడవేయవచ్చునేది కాంగ్రెస్ ప్రాథమిక ప్రణాళిక. ఈ నెల 18వ తేదిన కర్నూలులో భారీ సదస్సు నిర్వహించి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీని సభకు తీసుకువస్తామని ఉమెన్ చాందీ నేతలకు హామీ ఇచ్చారు. మొత్తానికి ఎన్నికలకు కాంగ్రెస్ యాక్టివేట్ అయ్యేందుకు కాస్త గట్టిగానే ప్రయత్నిస్తోందనుకోవాలి.