హైదరాబాద్: దేశవ్యాప్తంగా గృహాలలో, దేవాలయాలలో వృథాగా పడిఉన్న 20 వేల టన్నుల బంగారాన్ని బయటకు తీసుకురావటంకోసం కేంద్రప్రభుత్వం గత నవంబర్ నెలలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(జీఎమ్ఎస్) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ పథకానికి రెండు నెలల్లోనే 900 కిలోల బంగారం డిపాజిట్లుగా వచ్చి చేరింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ దాస్ ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. పథకం పట్ల ఆదరణ నిలకడగా ఉందని, రాబోయే కాలంలో ఇది మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదట ఈ పథకంపట్ల స్పందన పెద్దగా లేకపోయినా, తర్వాత ప్రభుత్వం చేసిన సవరణలతో ప్రజలలో ఆదరణ పెరిగింది. ఈ సవరణల ప్రకారం డిపాజిటర్లు కాలపరిమితికి ముందే తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవచ్చు. డిపాజిటర్లకు ఈ పథకంలో 2.5 శాతం వడ్డీ ఇస్తారు. ఇండియా ప్రతి ఏటా 1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఈ జీఎమ్ఎస్ పథకం ద్వారా ఆ దిగుమతిని తగ్గించాలని ప్రభుత్వం యోచన.