పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా.. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్.. ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం అయిన…ఈ నెల 14 కంటే ముందే ప్రమాస్వీకార కార్యక్రమం ఉంటుంది. ఎవరెవర్ని పిలవాలన్నదానిపై ఇమ్రాన్ కసరత్తు చేస్తున్నారు. భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆహ్వానం అందుతుందని.. కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన తన స్నేహితులైన.. సూపర్ స్టార్ అమీర్ ఖాన్, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌లను ఆహ్వానించారు. వీరందరూ.. ఇమ్రాన్ ఖాన్‌కు స్నేహితులు. మోడీని అహ్వానిస్తారంటూ… మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. రాజకీయ పరంగా ఎవరెవర్ని ఆహ్వానించాలనేది… విదేశాంగ అధికారులు నిర్ణయిస్తారని ప్రకటించారు.
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసే వేడుకకు.. సార్క్ దేశాల అధినేతలందర్నీ ఆహ్వానించారు. ఈ జాబితాలో.. పాకిస్థాన్ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. ఆయన వచ్చారు కూడా. ఆ తర్వాత ఓ విదేశీ పర్యటనకు వెళ్లి వస్తూ… చెప్పా పెట్టకుండా.. మోడీ… పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. నవాజ్ షరీఫ్ కుటుంబంలో ఓ శుభకార్యం ఉంటే… పాల్గొని.. గొప్పగా “హగ్‌ఫ్లోమసీ” నిర్వహించి వచ్చారు. అయినా పాకిస్థాన్‌తో సంబంధాలు ఏ మాత్రం మెరుగుపడలేదు. కానీ షరీఫ్‌పై మాత్రం.. ఆ దేశంలో వ్యతిరేకత పెరిగిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే… ఇమ్రాన్ ఖాన్…అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా.. ఆయన స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేరు. ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల్లో ఇమ్రాన్ నిమిత్తమాత్రుడేనన్న ప్రచారం ఇప్పటికీ జరుగుతోంది. సైన్యం గుప్పిట్లో ఇమ్రాన్ ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో.. టెర్రరిస్టు గ్రూపులు కూడా ఇమ్రాన్ గెలుపు కోసం సహకరించాయి. వారి మాటలనూ… జవదాటలేరు. కాబట్టి.. ఏ విధంగా చూసినా… మోడీని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలా వద్దా అన్నది… మిలటరీపైనే ఆధారపడి ఉంది. అమీర్ ఖాన్, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌లు వ్యక్తిగత మిత్రులు.. పైగా వారికి రాజకీయాలతో సంబంధం లేదు కాబట్టి.. ఇమ్రాన్ ఫ్రీ హ్యాండ్ తీసుకుని ఉండవచ్చు. కానీ ఇతర విషయాల్లో ఆయనకు అంత స్వేచ్ఛ లేదు. కాబట్టి… మోడీకి దాదాపుగా ఆహ్వానం లేనట్లే. అంటే మోడీ.. ఇమ్రాన్ మిత్రుల జాబితాలో లేరని అర్థం చేసుకోవచ్చు.