ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ముందడుగు వేసింది. చాలా రోజులుగా చర్చలు, ప్రతిపాదనల దశలో ఉన్న నిరద్యోగభృతి పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 12.26లక్షల మందికి నెలకు రూ. 1000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు. ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరును ఖరారు చేశారు. గతంలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాసాధికారిత సర్వేలో రిజిస్టర్ చేసుకున్న వారిలో నిరుద్యోగులంతా.. ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెలాఖరు నుంచి ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ కు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. 22 నుంచి 35 ఏళ్ల వయపరిమితిని నిర్ణయించారు. నిరుద్యోగ భృతిని నేరుగా బ్యాంక్ ఖాతాలో వేస్తామని లోకేష్ తెలిపారు.
తెలుగుదేశం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో నిరుద్యోగభృతి కూడా ఒకటి. కానీ దీన్ని అమలు చేయడానికి నాలుగున్నరేళ్ల సమయం తీసుకుంది. రెవిన్యూ లోటుతో ప్రభుత్వం ఇబ్బంది పడటం.. రైతు రుణమాఫీ సహా అనేక సంక్షేమ పథకాలకు కేటాయింపులు పెంచడంతో..ఇప్పటి వరకూ ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు దక్కలేదు.ఎన్నికల ముందు కూడా ఈ పథకాన్ని ప్రారంభించకపోతే విమర్శలొస్తాయన ముఖ్యమంత్రి భావించారు. ఎలాగో వనరులు సమీకరించుకుని.. పథకాన్ని అమలు చేయాలని నిర్ణయంచారు. ఈ పథకం విధివిధానాలు, ఇతర అంశాలపై పూర్తిగా మంత్రి లోకేష్ కసరత్తు చేశారు.ఆయనే ఈ పథకం వివరాలను ప్రకటించారు. ప్రభుత్వం కొన్నాళ్ల కిందట ప్రజాసాధికారిత సర్వే నిర్వహించింది. అందులో పేరు ఉన్నవారు నిరుద్యోగులంతా ధరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ ముఖ్యమంత్రి రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఏడాదికి రెండు సార్లు.. అందజేస్తారు. ఏపీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం.. దాదాపుగా 12 లక్షల మంది యువతకు.. నెలకు రూ. వెయ్యి అందించబోతోంది. కేసీఆర్ పథకాన్ని అందరూ ఓట్ల కొనుగోలు పథకంగా ఇతర పార్టీలు విమర్శించాయి. చంద్రబాబు ప్రవేశ పెట్టబోతున్న పథకాన్ని కూడా… ఇతర పార్టీ అదే విధంగా విమర్శించే అవకాశం కనిపిస్తోంది. నిరుద్యోగ భృతితో పాటు.. ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 20వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీతో ఉపాధ్యాయుల నియామకాలతో పాటు ఇతర శాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపనున్నారు. నూతన చేనేత విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.ఫిజియోథెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు, కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటుకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.