తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్గత రాజకీయాలు అవిశ్వాసం సుడిలో చిక్కుకున్నాయి. స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు టీఆర్ఎస్కు చికాకు తెప్పిస్తున్నానయి. ఇక్కడంతా.. టీఆర్ఎస్ వర్సెస్ టీఆరెఎస్ కావడమే దీనికి కారణం. ఎన్నికల ఏడాదిలో ఇలాంటివి వద్దని సాక్షాత్తూ.. పార్టీ అధినేత కేసీఆర్ చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేు. రామగుండం మేయర్ , పరకాల, భువనగిరి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో టిఆర్ఎస్ నేతలే చైర్మన్లుగా ఉన్నారు. ఈ నాలుగు చోట్ల అధికార పార్టీ నేతలే అవిశ్వాసానికి దిగారు. ముఖ్యంగా రామగుండం, బెల్లంపల్లి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ముందుగా అవిశ్వాస రగడ మొదలైంది. మేయర్ లక్ష్మినారాయణపై సొంత పార్టీ కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. వారికి ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రోత్సాహం అందించారు. అవిశ్వాసం వద్దని కేటీఆర్ వారించే ప్రయత్నం చేశారు. కానీ సోమారపు లెక్కచేయకపోగా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ బెదిరించి.. తన పని తాను చక్కబెట్టుకున్నారు. మేయర్‌పై అవిశ్వాసం నెగ్గించి పదవి ఊడగొట్టారు. బెల్లంపల్లిలోనూ సేమ్ సీన్. చైర్మన్ ని గద్దె దింపడమే లక్ష్యంగా సొంతపార్టీ నేతలు అవిశ్వాసానికి తెరలేపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎంత ప్రయత్నించినా నేతలను బుజ్జగించలేకపోయారు. పరకాల మున్సిపాలిటీ వ్యవహారంలో టీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకుంది. ఇండిపెడెంట్‌గా గెలిచిన రాజభద్రయ్యకు చైర్మన్ పదవి కట్టబెట్టారు. నాలుగేళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత రాజభద్రయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయనను గద్దె దించడమే లక్ష్యంగా అవిశ్వాసం ప్రకటించిన టీఆర్ఎస్.. కోరం చూపించడంలో విఫలమైంది. దీంతో నగర పంచాయతీ కాంగ్రెస్ ఖాతాలో పడింది.
భువనగిరి మున్సిపాలిటీ వ్యవహారంలో హై డ్రామా నడిచింది. హైకమాండ్ వద్దని చెప్పినా చైర్మన్‌ను గద్దె దింపేందుకు పావులు కదిపిన స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. హుజురాబాద్ మన్సిపాలిటీలో చైర్మన్ విజయ్ కుమార్‌పై సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అటు గద్వాల జిల్లా అయిజ మున్సిపల్ చైర్ పర్సన్ రాజేశ్వరిపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఖమ్మం కార్పొరేషన్లో మేయర్ పాపారావుపై అవిశ్వాసానికి సొంత పార్టీ నేతలే సిద్ధమవగా.. కేటీఆర్ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
మేయర్, చైర్మన్ మాత్రమే కాదు.. ఎంపీపీల విషయంలోనూ టీఆర్ఎస్కు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. సాదీ సీదా నేతలు, హుజూరాబాద్ ఎంపీపీగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు సతీమణిని తొలగించేందుకు మంత్రి ఈటల రాజేందర్ ప్రయత్నించారు. కసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆగిపోయారు. కేసీఆర్ మాటకు ఎదురుచెప్పే నేతలు టీఆర్ఎస్లో లేరని భావిస్తున్న సమయంలో..స్థానిక సంస్థల అవిశ్వాశాలు పరిస్థితిని మార్చేశాయి. ఎన్నికల ఏడాది కావడంతో.. కేసీఆర్ ఎవర్నీ ఏమీ అనలేకపోతున్నారు.