తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5
ఒకర్నొకరు కాసేపు చూసుకొని.. ఐదు నిమిషాలు మాట్లాడుకొంటే అది పెళ్లి కాదు. ఒకర్నొకరు అర్థం చేసుకోవాలి. ఒక మనసు మరొకరికి తెలియాలి. అప్పుడే పెళ్లి జరిగినా ఆ బంధం నిలబడుతుంది. ఈ విషయాన్ని బయటికి చెప్పకనే చెప్పాలనుకొని `చి.ల.సౌ` కథ రాసుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ఇన్నాళ్లూ తనకి నప్పని పాత్రలతో కథలతో సినిమాలు చేస్తూ వచ్చిన సుశాంత్, ఈసారి `చి.ల.సౌ`లాంటి సున్నితమైన కథని ఎంచుకున్నాడు. పెళ్లికి ముందు సాగే ప్రయాణమే ఈ చిత్రం.
కథ
అర్జున్ (సుశాంత్) ఓ కంపెనీలో బిజినెస్ ఎనలిస్ట్‌గా పనిచేస్తుంటాడు. ఖరీదైన కారు కొనడం, యూరప్ టూర్ వెళ్లడం… ఇలా జీవితంలో కొన్ని లక్ష్యాలుంటాయి. అవి సాధించేవరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకొంటాడు. కానీ ఇంట్లోవాళ్లు మాత్రం వయసైపోతుంది, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంటారు. అంజలి (రుహానిశర్మ)ది మరో కథ. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబానికి అన్నీ తానై బాధ్యతల్ని మోస్తుంటుంది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆమెకి పెళ్లి చాలా అవసరం. అలాంటి ఆమెతో పెళ్లి చూపులకి అర్జున్ అయిష్టంగానే ఒప్పుకొంటాడు. మరి ఆ పెళ్లిచూపుల్లో ఏం జరిగింది? ఒకరికొకరు నచ్చారా లేదా? వీళ్లిద్దరి పెళ్లి జరిగిందా? అనే విషయాల్ని తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
మంచి కథల కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన అవసరం లేదు. మన చుట్టూనే ఉంటాయి, మన జీవితాల్లోనే, అతి సాధారణంగా ఉంటాయని మరో మారు రుజువు చేస్తుందీ చిత్రం. పెళ్లీడుకొచ్చిన ఓ జంట చుట్టూ, 24 గంటల్లో సాగే కథ ఇది. 24 గంటల్లో జరిగే కథలో మహా అంటే ఏముంటాయి? ఒకట్రెండు ఆసక్తికరమైన సంఘటనలు చూపించడం తప్ప అనుకొంటే మనం పప్పులో కాలేసినట్టే. ఈ చిన్న కథలో దాదాపుగా జీవితాన్నే చూపించాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఆద్యంతం నవ్విస్తూ, అక్కడక్కడా సున్నితంగా హృదయాల్ని తాకుతూ సాగుతుందీ చిత్రం. పెళ్లంటేనే చికాకుపడే అర్జున్ కథతో సినిమా మొదలవుతుంది. పెళ్లిచూపులు ప్రక్రియతో కథానాయిక ఎంట్రీ ఇస్తుంది. అప్పటికే కథ వేగం పుంజుకోగా, ఇక ఈ ఇద్దరూ కలిశాక మరింత ఆసక్తి మొదలవుతుంది. పెళ్లంటే ఏమాత్రం ఇష్టం లేని అర్జున్… తనకి తెలియకుండానే ఓ అమ్మాయి జీవితంతో కనెక్ట్ అయిపోతాడు. ప్రేక్షకుడిని కథకి బాగా కనెక్ట్ చేసే విషయం కూడా అదే. ద్వితీయార్థంలో కథతో మరింత రక్తికట్టించాడు దర్శకుడు. అక్కడ చోటు చేసుకొనే మలుపులు సినిమాని ఓ క్రైమ్ థ్రిల్లర్ దిశగా నడిపిస్తున్నంత పనిచేశాయి. కానీ ఆ వెంటనే కథ మరో మలుపు తీసుకొని ఇది పెళ్లి కథే అని, కథని విడిచి సాము చేయలేదని గుర్తుచేస్తాడు దర్శకుడు. ఒక చిన్న కథని దర్శకుడు అక్కడక్కడే తిప్పుతూ హాస్యం, భావోద్వేగాలు, ఆసక్తి పండించిన విధానమే ఈ సినిమాకి హైలెట్. చిన్న కథని తిప్పడంతోనే సరిపెట్టకుండా, తాను ఏం చెప్పాలనుకొన్నాడో అది సన్నివేశాలతో సూటిగా చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. పెళ్లి విషయంలో అమ్మాయిలు పడే సంఘర్షణ… అబ్బాయిలు వద్దని చెప్పాక కుటుంబ సభ్యుల్లో కనిపించే ఆందోళనల్ని చాలా సహజంగా చూపించాడు దర్శకుడు. అలాగే ఐదు నిమిషాలు ఇద్దరితో మాట్లాడించేసి, పెళ్లి చేసుకోండని.. జీవితాంతం కలిసుండమని చెప్పేస్తారా అన్న కథానాయకుడి ప్రశ్న కూడా ఆలోచింపజేసేదే. ప్రతిసన్నివేశం వాస్తవికతని ప్రతిబింబించేలా సాగుతుంది. సుశాంత్, వెన్నెలకిషోర్‌ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. ప్రేమలేఖని తన స్టాఫ్ మొత్తానికి మెయిల్ చేయడం… జ్యూస్ కోసమని ఎదురింటి ఆంటీని అడగడం, అప్పుడే వాళ్లాయన రావడం… వంటి సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.
నటీనటులు
తొలిసారి తనకి తగ్గ కథని ఎంచుకొని చేశాడు సుశాంత్. దాంతో ప్రతి సన్నివేశంలోనూ సహజంగా, పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. ఏ ఎమోషన్ కూడా ఇంతకుముందులాగా కొని తెచ్చుకొన్నట్టు అనిపించదు. అర్జున్‌గా పర్‌ఫెక్ట్‌గా నటించాడు. కామెడీ టైమింగ్ కూడా బాగా కుదిరింది. రుహానిశర్మ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఆమె అభినయం సహజంగా ఉంది. భాష తెలియకపోయినా పాత్రలో ఇమిడిపోయి నటించింది. కళ్లతోనే ఎమోషన్స్ పండించింది. హీరోహీరోయిన్లు మొదలుకొని.. ఎవ్వరికీ ఈ సినిమాలో మేకప్ ఉండదు. వెన్నెల కిషోర్ కామెడీ బాగా పండింది. కథ వేగం తగ్గుతుందనుకొన్న ప్రతిసారీ సుశాంత్‌తో కలిసి వినోదాన్ని పండించాడు. అలాగని కథని విడిచి ఏమీ చేయలేదు. కథలో భాగంగానే నవ్వించాడు. రోహిణి, అనుహాసన్, విద్యుల్లేఖరామన్… ఇలా అందరూ పాత్రల పరిధి మేరకు ఎఫెక్టివ్‌గా నటించారు.
సాంకేతికత
రాహుల్ రవీంద్రన్‌కి ఇదే తొలి సినిమా అయినా… రచన పరంగా, టేకింగ్ పరంగా ఎంతో పరిణతి కనబరిచాడు. ఇలాంటి చిన్న కథల్ని సినిమాలుగా తీయడం సాహసమే. రాహుల్ మాత్రం చాలా స్పష్టతతో చిత్రాన్ని తీశాడు. సుకుమార్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. ఎక్కువగా రాత్రిపూటే జరిగే ఈ కథలో ఆయన కెమెరా పనితనం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. ఛోటా కె..ప్రసాద్ ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. ప్రశాంత్ విహారి సంగీతం చిత్రానికి ప్రధాన బలం. పాటలు కథలో భాగంగానే వస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సాంకేతికంగా సినిమాకి ఏం కావాలో అవన్నీ పక్కాగా సమకూరాయి.
తీర్పు
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమధ్య నాగార్జున మాట్లాడుతూ ఇది రైటర్ల టైమ్ అని చెప్పారు. నిజంగా రచన పరంగా బాగుందంటే ఇక సినిమాకి అన్నీ కుదిరినట్టే లెక్క. ఈ సినిమా అదే చెబుతుంది. చిన్న కథని మలుచుకొన్న విధానం, అందులో భావోద్వేగాలు పండించిన విధానమే ఈ సినిమాకి హైలెట్. పెద్ద కారణాలేమీ లేకుండా పెళ్లి వద్దంటూ చాలా హడావుడి చేసే విధానం… వద్దు వద్దు వెళ్లిపో అంటూనే కథానాయకుడిని కథానాయిక తన చుట్టూనే తిప్పుకొనే వైనం కాస్త డ్రమటిక్‌గా అనిపిస్తుంది తప్ప మిగతా సినిమా అంతా ఓ ఫీల్‌గుడ్ అనుభూతిని పంచుతుంది.
ఫైనల్ టచ్ : పెళ్లిచూపులు సక్సెస్
తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5