ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెన్షన్లు, సంక్షేమ పథకాల అమలు గురించి మాట్లాడుతూ… వీటికి సంబంధించి అన్ని వివరాలూ సేకరిస్తున్నారన్నారు. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ… ఈ మధ్య పవన్ కల్యాణ్ తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఒకప్పుడు చాలా గట్టిగా ఉన్నారనీ, కానీ ఇప్పుడు మాట మార్చేశారన్నారు. మొత్తంగా ఆయన రూటే మార్చేశారన్నారు. తెలుగుదేశం పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కేంద్ర కేటాయింపులపై ఆయన ఫ్యాక్ట్ ఫైడింగ్ కమిటీ వేశారనీ, రూ. 75 వేల కోట్లు రావాలని లెక్కలు తేల్చారనీ, ఆ తరువాత దాని గురించి ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటూ విమర్శించారు. ఇంకోపక్క సింగపూర్ తరహా పరిపాలన కావాలంటూ వ్యాఖ్యానిస్తుంటారన్నారు. సింగపూర్ ప్రభుత్వం ఎవర్నైనా నమ్మిందీ అంటే, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మాత్రమేనని గుర్తించాలన్నారు. ఆంధ్రాకి అన్ని రకాలుగా వారు సహకరిస్తున్నారన్నారు.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడదామనీ, తమ వెంట రావాలంటూ వైకాపా కోరిందన్నారు. కానీ, వారి వెంటే వెళ్తే ఏం జరుగుతుందన్నారు. మూడున్నర సంవత్సరాల నుంచీ మాట్లాడుతున్నామని, పోరాడుతున్నామని వారు చెప్పుకుంటున్నా, దేశంలో ఏ ఒక్కరూ స్పందించలేదన్నారు. వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి బయటకి వచ్చారనీ, ఇప్పుడు తమ ఎంపీలను రాజీనామా చెయ్యాలంటూ డిమాండ్ చేస్తుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేంద్రంపై తాము రాజీలేకుండా పోరాటం చేస్తుంటే.. వెన్నెముక చూపించి పారిపోయి వచ్చిన పార్టీ వైకాపా అని విమర్శించారు.
గతవారంలో జరిగిన గ్రామ దర్శిని సభల్లో ప్రధానంగా వైకాపాను టార్గెట్ చేసుకుంటూ ముఖ్యమంత్రి ప్రసంగాలు సాగాయి. ఇవాళ్ల జగన్ తోపాటు పవన్ కల్యాణ్ పై కూడా తీవ్ర విమర్శలే గుప్పించారు. వైకాపా, జనసేనల్ని ఒకేగాటన కట్టి సీఎం మాట్లాడుతూ ఉండటం గమనార్హం. టీడీపీ ఒకపక్క… భాజపా, జనసేన, వైకాపాలు మరోపక్క అనే స్పష్టమైన డివిజన్ ను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే విధంగా సీఎం ప్రసంగాలుంటున్నాయి.