“అక్కినేని నాగేశ్వరరావు” తెలుగు పరిశ్రమ కి సంబంధించినంతవరకు మాత్రమే కాదు, భారత సినీ పరిశ్రమలోనే ఒక లెజెండ్. ఇప్పుడు ఆయన మూడో తరం నడుస్తోంది. చాలా సంవత్సరాలుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆయన మనుమడు, మనుమరాలికి ఆ సక్సెస్ ఒకేసారి లభించింది. వివరాల్లోకి వెళితే..
సుప్రియ – అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా 22 ఏళ్ల కిందట పవన్ కళ్యాణ్ మొదటి సినిమా “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” తో తెలుగు పరిశ్రమలోకి హీరోయిన్ గా ఆరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడమే కాకుండా తను హీరోయిన్ పాత్రలకు నప్పదని విమర్శలు రావడంతో ఆ తర్వాత నటనకు దూరమై ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటోంది. అయితే రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ తెరమీద “గూడచారి” సినిమా లో కనిపించింది. ఆ సినిమాకు మంచి టాక్ రావడమే కాకుండా సుప్రియ నటనకు కూడా బాగా పేరొచ్చింది. దీంతో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఇక అక్కినేని నాగేశ్వరరావు మనుమడు సుశాంత్ కూడా 2008లో కాళిదాసు సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆతర్వాత కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా లాంటి పలు సినిమాల్లో నటించినా, ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయాడు. అయితే ఎట్టకేలకు గూడచారి తోపాటు ఇదే వారం విడుదలైన “చి|| ల|| సౌ||” సినిమా ద్వారా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హిట్ ని సొంతం చేసుకున్నాడు. మరీ అద్భుతమైన విజయం కాకపోయినప్పటికీ, పరిమిత బడ్జెట్లో, చిన్న కథ తో ఆహ్లాదకరమైన సినిమాగా రూపొందిన ఈ సినిమా కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటోంది. మొత్తానికి పదేళ్ల తర్వాత హిట్ అనిపించుకునే సినిమాలో నటించాడు సుశాంత్. దాంతోపాటే సుశాంత్ నటనకు కూడా ప్రేక్షకుల మార్కులు బాగానే పడ్డాయి ఈ సినిమాతో.
వీళ్ళిద్దరే కాకుండా “సుమంత్” కూడా ఇవాళ ట్వీట్ చేసి ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో, తాత గారైన అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో తాను నటించబోతున్నట్టు అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు. సుమంత్ కూడా రెండు దశాబ్దాల క్రిందట సినీపరిశ్రమలోకి వచ్చినప్పటికీ , మధ్యలో గోదావరి లాంటి హిట్ సినిమాలు వచ్చినా, హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. మరి ఎన్టీఆర్ బయోపిక్ తనకు కెరీర్ పరంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.
మొత్తానికి అక్కినేని కుటుంబానికి చెందిన ముగ్గురూ, దశాబ్దాలుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ముగ్గురూ, ఒకే వారం 3 శుభవార్తలు చెప్పడం చూస్తుంటే అక్కినేని వారసులకు “గుడ్ టైం” మొదలైనట్టు అనిపిస్తోంది.