కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని మళ్లీ అసెంబ్లీకి రానివ్వకూడదనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి చాలా రోజులుగా ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా.. చాన్నాళ్ల పాటు అభివృద్ధి పనులను నిలిపి వేసిన ప్రభుత్వం.. వ్యూహాత్మకంగా.. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో.. ఉద్ధృతంగా వాటిని పట్టాలెక్కించాలని డిసైడయింది. కొడంగల్ బాధ్యతలను మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు ద్వితీయశ్రేణి నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఈ రోజు ముగ్గురు మంత్రులు కలిసి.. కోస్గిలో బస్ డిపో శంకుస్థాపనకు వెళ్లారు. భారీగా బలప్రదర్శన కూడా చేశారు.
కానీ కోస్గిలో బస్ డిపోకు ప్రభుత్వం నాలుగేళ్ల కిందటే అనుమతి ఇచ్చింది. అప్పట్లో భూమి లేదంటే..స్వయంగా రేవంత్ రెడ్డి సోదరుడికి చెందిన భూమిని… ప్రభుత్వానికి అప్పగించారు. ఆ భూమిలో డిపో కట్టడానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ తర్వాత పరిణామాలతో పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా అదే డిపోకు శంకుస్థాపన చేసేందుకు మంత్రులు భారీ ప్రదర్శనగా వెళ్లారు. వీరితో తాడో పేడో తేల్చుకోవడానికి రేవంత్ రెడ్డి కూడా సిద్ధమయ్యారు. కోస్గిలో ఆర్టీసీ బస్ డిపోకి తానే స్థలం కేటాయించానంటూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేవంత్ అనుచరులు ఎక్కడిక్కడ గుమికూడారు. ఫ్లెక్సీలను చాలా చోట్ల తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
నియోజకవర్గ నలుమూలల నుంచి ఉదయమే టీఆర్ఎస్ శ్రేణులు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కోస్గి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డిలు వందవాహనాల భారీ కాన్వాయ్‌తో కొడంగల్ వచ్చారు. స్థానిక ఎమ్మెల్యేగా బస్ డిపో శంకుస్థాపనకు హాజరయ్యేందుకు ప్రయత్నించారు. రేవంత్‌రెడ్డి కొడంగల్ నుంచి కోస్గికి భారీ ర్యాలీగా చేయడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే ఈ వార్తను ఏ మీడియా సంస్థ కూడా పెద్దగా కవర్ చేయలేదు. ప్రాధాన్యం ఇవ్వలేదు.