ఎన్టీఆర్ బయోపిక్ ఎలా ఉండబోతోంది? అందులో ఏం చెప్పబోతున్నారు? రెండు భాగాలుగా తీస్తారా? లేదా, ఒక భాగంతో సరిపెడతారా? ఆ కథ ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ చూపిస్తారు? ఇలా రకరకాల ప్రశ్నలు. వీటికి తెలుగు 360 కొంత వరకూ క్లారిటీ సంపాదించే ప్రయత్నం చేసింది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా కాదు, ఒక సినిమాగానే వస్తోంది. విశ్రాంతి ముందు వరకూ… ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపిస్తారు. విశ్రాంతి తరవాత రాజకీయ రంగప్రవేశం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, పదవిలో ఉండగా ఎదురైన ఒడిదుడుకులు, రాజీనామా చేయడం, మళ్లీ ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ చూపిస్తారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక.. ఈ సినిమా ముగుస్తుంది. ఎన్టీఆర్ మద్రాస్‌లో అడుగుపెట్టి ఓ సినిమా స్టూడియోని వెదికే క్రమంలో `ఎన్టీఆర్` సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. రాజకీయ రంగ ప్రవేశం కోసం చేసే ప్రకటనతో ఇంట్రవెల్ కార్డు పడుతుంది. ఎన్టీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, యవ్వన దశ… ఇవి కూడా చూపిస్తారు. కానీ అంత కూలంకశంగా కాదు. సినిమా నటుడిగా ఎదిగే తీరుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. స్క్రిప్టు దశలో దాదాపుగా 150 సన్నివేశాలు రాసుకున్నారు. వాటిని కుదించి, కుదించి 75కి తీసుకొచ్చారు. ఇంకా వడబోత సాగుతూనే ఉంది. రాసిన ప్రతీ సీనూ తీసుకుంటూ పోతే.. రెండు భాగాలు తీయాల్సిన సినిమా ఇది. అలా తీస్తే.. తొలిభాగం చూసిన ప్రేక్షకుడు అసంతృప్తికి లోనవుతాడని, కథ మొత్తం ఒకే సినిమాగా చెప్పడమే భావ్యమని బాలకృష్ణ భావించారని సమాచారం. అందుకే… సన్నివేశాల్ని కుదించాల్సివస్తోంది. ముందు అనుకున్న స్క్రీన్ ప్లేకీ, ఇప్పుడు స్క్రీన్ ప్లేకీ చిన్న చిన్న మార్పులే వచ్చాయని, కథాగమనంలో మార్పుల్లేవని, మధ్యలో అనవసరం అనుకున్న సన్నివేశాలనే తొలగించారని సమాచారం.