నిన్న మొన్నటివరకూ హిందీ సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన బయోపిక్స్ ట్రెండ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనూ జోరు అందుకుంది. ఇటీవల నటీనటుల బయోపిక్స్ తీయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగులో సావిత్రి బయోపిక్ ‘మహానటి’ వచ్చింది. హిందీలో దత్ బయోపిక్ ‘సంజు’ వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఇంకా ఈ జాబితాలో ఇంకొన్ని పేర్లు వున్నాయి. అయితే… ఈ బయోపిక్స్ మీద సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పెదవి విరిచారు. బయోపిక్స్‌లో వాస్తవికత ఎక్కడుంది? అంతా నాటకీయతే (డ్రామాయే) అని ఆయన పేర్కొన్నారు. “బయోపిక్స్‌ని డాక్యుమెంటరీలుగా తీస్తే బాగుంటుంది. కానీ, వాటికి పెద్దగా ప్రజాదరణ లభించడం లేదు. కమర్షియల్ సక్సెస్ కోసం డ్రామాను యాడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే డ్రామా వచ్చిందో అప్పుడు వాస్తవాలు కొన్ని మరుగున పడుతున్నాయి” అని సింగీతం వ్యాఖ్యానించారు. నేరుగా ఆయన ఏ సినిమా పేరునీ ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమం నిమిత్తం విజయవాడ, గుంటూరు వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పైన పేర్కొన్న విధంగా స్పందించారు.