గురువారం ఏడు కి.మీ. శుక్రవారం రెండు కి.మీ. శనివారం నాలుగు కి.మీ. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నడుస్తున్న తీరు. సాధారణంగా ఓ మనిషి రోజువారీ పనులు చేసుకోవడానికి ఇంత మాత్రం నడుస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పాదయాత్ర అనే కార్యక్రమం పెట్టుకుని మరీ ఇంత నెమ్మడిగా నడవడానికి కారణం ఏమిటన్నదానిపై.. వైసీపీ నేతల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్కు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయని.. ఏడు నెలల నుంచి నడుస్తూ ఉండటం వల్ల .. కాళ్ల నొప్పులు.. ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. దీనికి తగ్గట్లుగానే… అతితక్కువ పాదయాత్ర చేసిన రోజుల్లో.. జగన్మోహన్ రెడ్డి జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని.. ప్రకటిస్తోంది.
నిజానికి జగన్మోహన్ రెడ్డి.. పులివెందులలో పాదయాత్ర ప్రారంభించిన తొలి రోజే… నడుము నొప్పికి గురయ్యారు. అప్పట్నుంచి బెల్ట్ పెట్టుకుని పాదాయత్ర చేస్తున్నారు. మధ్యలో వారానికోసారి కోర్టు పని ఉండటం వల్ల … విశ్రాంతి దొరుకుతోంది. ఈ మధ్య కాలంలో గురువారం కూడా పాదయాత్రను ఒకటి, రెండు కి.మీలకే పరిమితం చేస్తున్నారు. దాంతో రెండు రోజుల రెస్ట్ కలసి వస్తోంది. అయినప్పటికీ.. పాదయాత్ర అత్యంత నెమ్మదిగా సాగించడానికి ఆరోగ్య సమస్యలు తిరగబెట్టడమే కారణం అంటున్నారు. నడిచే నాలుగైదు కిమీటర్లను ను కూడా.. వీలైనంత వేగంగా పూర్తి చేస్తున్నారు. మిగతా సమయం అంతా టెంట్లోనే గడుపుతున్నారు. పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
జగన్ పాదయాత్ర బృందంలో డాక్టర్లు, ఫిజియోధెరపిస్టుల బృందం ఉంది. రోజులో రెండు సార్లు జగన్ కాళ్లకు వీళ్లు ఫిజియోధెరపి చేస్తున్నారు. డాక్టర్లు కూడా.. జగన్ను కాస్తంత నడక దూరాన్ని తగ్గించుకోవలాని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా పాదయాత్ర కంటిన్యూ చేయాలని లేదని వైసీపీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. ఆరు నెలలు.. మూడు వేల కిలోమీటర్ల లెక్క పెట్టుకున్నారు కాబట్టి.. ఆ 3 వేల మార్క్ అందుకున్న తర్వాత బస్సు యాత్ర చేద్దామనుకుంటున్నారు. బహుశా దాని కోసమే.. జగన్ భారంగా నడుస్తున్నారనుకోవచ్చు.