తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై స్పష్టత కోసం ఆయన వెళ్లారని అంటున్నారు. నిజానికి, కేసీఆర్ ఢిల్లీ టూర్ అజెండాగా చెబుతున్న అంశాలేవీ కొత్తవి కావు. ఇంతకుముందు కూడా దాదాపు ఇవే అంశాలతో ఢిల్లీ వెళ్లొచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పదకొండు అంశాలపై గతంలోనే కేంద్రానికి కొన్ని నివేదికలు పంపారు. అంతేకాదు, గతంలో ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ప్రధానమంత్రితో ఇవే అంశాలపై చర్చించామన్నారు. కాబట్టి, ఇప్పుడు కొత్తగా ఆయా అంశాలపై కేంద్రాన్ని కేసీఆర్ కోరాల్సిందేం లేదనీ కొంతమంది అంటున్నారు! అందుకే, ఆయన పర్యటన వెనక రాష్ట్ర పరిస్థితుల కంటే, రాజకీయ పరిణామాలపై స్పష్టత కోసమే ప్రధాన అజెండా అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఇంతకీ, కేసీఆర్ కు కేంద్రం నుంచి రావాల్సిన స్పష్టత ఏంటంటే.. ‘ముందస్తు ఎన్నికలు’ అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో లోక్ సభకు ముందస్తు అవకాశాలు దాదాపు తక్కువగానే ఉన్నాయి. ఇక, తెలంగాణలో ముందస్తు రాగాన్ని ముందుగానే కేసీఆర్ అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరి… ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ, తెలంగాణలో కూడా ఈ చర్చ దాదాపు తెరమరుగైంది. కానీ, కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మరోసారి వినిపిస్తోంది. ప్రధానితో జరిగిన భేటీలో రాష్ట్రంలో తాము ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనను కూడా ముందుంచినట్టు సమాచారం. అయితే, ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే.. వెంటనే ఎన్నికలు వస్తాయా అనే అనుమానాలు చాలా ఉన్నాయి.
ఎన్నికల సంఘం వెంటనే ఎన్నికలకు సిద్ధమౌతుందా అనేదే ప్రశ్న? దీనిపై క్లారిటీ కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ ముగిసినా కూడా కేసీఆర్ మరో రెండ్రోజులు అక్కడే ఉండటం వెనక కారణం కూడా ఇదే అంటున్నాయి ఢిల్లీ రాజకీయ వర్గాలు. కొంతమంది భాజపా పెద్దలతో ఆయన సమావేశమై, ముందస్తు సాధ్యాసాధ్యాలపై స్పష్టత కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు హస్తిన వర్గాల నుంచి కాస్త బలంగానే వినిపిస్తోంది.
నిజానికి, లోక్ సభకు ముందస్తు దాదాపు రావనే వాతావరణమే కనిపిస్తోంది. అంతేకాదు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గడువు ప్రకారం జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్ని కూడా వాయిదా వేసేందుకు భాజపా చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలా వద్దా అనే స్పష్టత కోరేలా ప్రయత్నిస్తే.. సానుకూల స్పందన వస్తుందా అనేది అనుమానం.