తెలంగాణలో జనసేనను బలోపేతం చేయడానికి ..మోత్కుపల్లి నర్సింహులు ను పార్టీలోకి తీసుకుని.. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని.. జనసేన కాంపౌండ్ నుంచి.. నాలుగు రోజుల కిందట మీడియాకు సమాచారం వచ్చింది. పవన్ కల్యాణ్‌ను మోత్కుపల్లి కలవబోతున్నారని… టైం కూడా ఫిక్స్ చేశారు. వెంటనే మీడియా కూడా కాస్తంత హడావుడి చేసింది. కానీ ఆ భేటీ జరగలేదు. ఈ విషయాన్ని లీకుల రూపంలో బయటకు వదిలారు కాబట్టి.. ఎందుకు భేటీ జరగలేదో .. జనసేన వర్గాలు చెప్పలేదు. పవన్ కల్యాణ్ వ్యవహారం తెలిసిందే కాబట్టి.. ఆయన ఎప్పుడు కలవాలనుకుంటే.. అప్పుడే కలుస్తారని.. భావించారు. ఆలస్యమైనా .. ఎప్పుడో ఓ సారి కచ్చితంగా భేటీ అవుతారని అంచనా వేశారు.
కానీ అనూహ్యంగా మోత్కుపల్లి నర్సింహాలు నాలుగు రోజుల తర్వాత తాను జనసేనలోకి వెళ్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. అన్నీ పుకార్లేనని చెప్పుకొచ్చారు. అంటే.. పవన్ కల్యాణ్‌తో భేటీ లేదని తేలిపోయిన తర్వాత మోత్కుపల్లి నర్సింహులు ఈ ప్రకటన చేశారు. పవన్ కల్యాణ్ కర్నూలు వెళ్లి … అక్కడ క్వారీ పేలుడు ప్రాంతాన్ని పరిశీలించి… అక్కడ్నుంచి… ఒక్క రోజుకే ఆపేసిన…పశ్చిమగోదావరి జిల్లా పోరాటయాత్రలో పాల్గొంటారు. ఈ షెడ్యూల్లో మోత్కుపల్లితో భేటీ లేదు. ఇక ఆ అవకాశం లేదని తెలిసి మోత్కుపల్లి జనసేనలో చేరిక వార్తల్ని ఖండించారు.
చంద్రబాబును విమర్శించి తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత మోత్కుపల్లికి సరైన పొలిటికల్ ఫ్లాట్ ఫాం దొరకడం లేదు. ఏపీ పార్టీలు వచ్చి.. చంద్రబాబును తిట్టేందుకు యాత్రను స్పాన్సర్ చేస్తామని ఆఫర్ ఇచ్చాయి. ఓ సారి తిరుపతికి వెళ్లాడు. కానీ తర్వాత యాత్ర సంగతేమయిందో తెలియలేదు. తెలంగాణలో ఏ పార్టీలో చేరాలనుకున్నా… గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఒకప్పుడు.. కేసీఆర్‌ను అత్యంత దారుణంగా విమర్శించిన నోటితోనే.. ఆయనను ఎన్టీఆర్‌తో పోల్చి పొగడ్తలు కురిపించారు. కానీ టీఆర్ఎస్ తలుపులు తెరుచుకోలేదు. కాంగ్రెస్ రానివ్వలేదు. బీజేపీలోకి వెళ్లలేడు. ఇప్పుడు జనసేన కూడా.. దూరమైనట్లే. పాపం మోత్కుపల్లి లాంటి సీనియర్ నేత.. ఎన్నికలకు ముందు ఒంటరిగా మారిపోయారు.