రాజ్యసభలో ఈ రోజు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అనూహ్యంగా జరిగిన ఓటింగ్ లో తెలుగుదేశం పార్టీ కి చెందిన సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థి కన్నా ఏకంగా 37 ఓట్లు ఎక్కువగా తెచ్చుకుని సంచలనం సృష్టించారు. బీజేపీ అభ్యర్థికి కేవలం 69 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో అభ్యర్థిగా పోటీ పడిన ..ఎన్డీఏ పార్టీ జేడీయూ అభ్యర్థికి అత్యల్పంగా 26 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఓటింగ్ జరిగింది.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ప్రాతినిధ్యం కోసం.
పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా.. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఎన్నికయ్యారు. రాజ్యసభ నుంచి పీఏసీలో సభ్యులుగా చాన్స్ ఉండే రెండు పోస్టుల కోసం.. ముగ్గురు పోటీ పడ్డారు. టీడీపీ నుంచి సీఎం రమేష్, బీజేపీ నుంచి భూపేంద్రయాదవ్, జేడీయూ నుంచి హరివంశ్ పోటీ పడ్డారు. సీఎం రమేష్ కు 106 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి భూపేంద్రయాదవ్ కు 69 ఓట్లు వచ్చాయి. జేడీయూ నేత హరివంశ్ కు కేవలం ఇరవై ఆరు ఓట్లు మాత్రమే రావడంతో పరాజయం పాలయ్యారు. రాజ్యసభలో జరిగిన ఈ ఓటింగ్ ప్రక్రియ రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తించింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ కు కాంగ్రెస్, అన్నాడీఎంకే, సీపీఎం, సీపీఐ పార్టీల సభ్యులు మద్దతుగా నిలిచారు. బీజేపీకి మాత్రం సొంత సభ్యులు మాత్రమే ఓట్లేశారు. బీజేపీ అభ్యర్థి భూపేంద్రసింగ్.. అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు. అందుకే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులంతా.. కచ్చితంగా ఓటింగ్ హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. అంతే కాదు..తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఓటింగ్ సమయానికి తాను కూడా.. రాజ్యసభకు వచ్చారు.
జేడీయూకి ఇతరులు కొంత మంది మద్దదు పలికినా ఓడిపోయారు. పీఏసీలో ఇప్పటికే కాంగ్రెస్ తరపున లోక్ సభ నుంచి సభ్యులు ఉంటారు కాబట్టి.. రాజ్యసభ నుంచి అ అవకాశాన్ని మరో విపక్ష పార్టీ అయిన టీడీపీకి … కల్పించాలని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలన్నీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల జరగనుండటంతో.. ఈ ఓటింగ్ ..ఢిల్లీ రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఈ ఓటింగ్ ను ఓ సరళిగా భావిస్తున్నారు. బీజేపీకి ఇతర మిత్రపక్షాలేవీ మద్దతుగా నిలబడలేదు.మిత్రపక్షమైన జేడీయూ తరపున పోటీ చేసిన హరివంశ్ కోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా .. ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మిత్ర పక్షాలతోనూ మాట్లాడలేదు. దాంతో అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా .. టీడీపీ అభ్యర్థికే మద్దతు తెలిపారు.