ప్రపంచంలోని టాప్ త్రీ ఎలక్ట్రానిక్ మొబైల్ విడిభాగాల తయారీ సంస్థ హోలిటెక్. చైనాకు చెందిన ఈ సంస్థ తమ దేశం బయట… తొలి సారి ఓ తయారీ కేంద్రాన్ని.. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోతోంది. రూ. 1400కోట్ల పెట్టుబడితో కనీసం రెండు వేల మందికిపైగా నేరుగా ఉపాధి లభించే ఈ పరిశ్రమ ఏపీకి తరలి వస్తున్న ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ సంస్థలకు ఓ దిక్సూచీగా మారనుంది. మీడియాలో దీనికి ఎంత ప్రాధాన్యత ఇస్తే.. అంతగా.. ఇతర పరిశ్రమల దృష్టిలో పడుతుంది. ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయంటే.. సహజంగానే ప్రజలకు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. అందుకే అన్ని మీడియా సంస్థలు.. న్యూస్ పేపర్లు, టీవీ చానళ్లు.. ఈ వార్తకు ప్రాధాన్యత ఇచ్చి కవర్ చేశాయి. ఒక్క సాక్షి దినపత్రిక మినహా.
ఆంధ్రప్రదేశ్ అంటే అదో విషాదాల కూపం అన్నట్లుగా ప్రచారం చేయాలని… సాక్షి పత్రిక తహతహలాడిపోతోంది. చిన్న ప్రమాదం జరిగితే హాహాకారాలు పెట్టే సాక్షి… ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరిగే విషయంలో.. ఎలాంటి మొహమాటలకూ పోదు. ఏ మాత్రం ప్లస్ పాయింట్.. ఉన్నట్లు అనిపించినా.. వార్తను కిల్ చేసేస్తుంది. .. కచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే.. అందులో నెగటివ్ పాయింట్లు వెదుక్కుని… ఎంతగా మైనస్ చేసే అవకాశం ఉందో.. అంతగా మైనస్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అది పెట్టుబడులు కావొచ్చు..రాజకీయం కావొచ్చు.. ఏదైనా పూర్తిగా.. ఏపీని నెగెటివ్‌గా ప్రపంచం ముందు ప్రజెంట్ చేస్తోంది సాక్షి దినపత్రిక.
హోలిటెక్తో ఎంవోయూ విషయంలో సాక్షి దినపత్రిక ఇదే స్ట్రాటజీని అవలంభించింది. ఎంవోయూనే కదా అని “సాక్షి” తేలిగ్గా తీసుకుందని.. అనుకోవడానికి వీల్లేకుండా.. మరో చోట… దొరికిపోయింది. తెలంగాణలో ఓ బైక్‌ల తయారీ సంస్థ అసెంబ్లింగ్ ప్లాంట్ పెట్టడానికి ఎంవోయూ చేసుకుంటే.. ఏపీ ఎడిషన్‌లోనూ దానికి బాక్స్ కట్టి మరీ ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించారు. అదే ఏపీలో.. ఏకంగా చైనా నుంచి ఓ విడిభాగాల తయారీ సంస్థ ప్లాంట్ పెట్టడానికి వస్తే ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి..?. ఏపీలో తెలంగాణకు పరిశ్రమలు వస్తున్నాయని… గొప్పగా చెప్పడానికి ప్రయత్నిస్తున్న సాక్షి.. ఏపీకి వచ్చే పరిశ్రమల విషయాలను ఎందుకు దాచి పెడుతోంది..?. ఏపీ ఇమేజ్ను దెబ్బతీయాలనే ప్రయత్నమేనా..? అన్న అనుమానాలు పాఠకుల్లో సహజంగానే వస్తూంటాయి.
సాక్షి పత్రికకు రాజకీయ ఎజెండా ఉండొచ్చు. అజెండా ప్రకారం వార్తలు ఇచ్చుకోవచ్చు. కానీ ప్రతీ విషయాన్ని రాజకీయం పులిమి వార్తలను కిల్ చేయడమో.. నెగెటివ్‌గా ప్రజెంట్ చేయడమో చేస్తే… ఏపీకే కదా నష్టం జరిగేది. ఆ విషయాన్ని సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్ ఎందుకు గుర్తించలేకపోతున్నారో మరి..!