విశ్వరూపం 1కీ, 2కీ నాలుగేళ్ల విరామం వచ్చేసింది. ఇది సీక్వెలో, ప్రీక్వెలో కాదు. రెండో భాగం. తొలి భాగంలో జరిగిన కథకు, రెండో భాగంతో లింకు ఉంటుంది. కాబట్టి ‘విశ్వరూపం 2’ చూద్దామనుకు ప్రేక్షకుడు ‘విశ్వరూపం 1’ చూడాలి. ఆ కథేంటో తెలిసుండాలి. చూస్తే.. నాలుగేళ్లయినా గుర్తుండాలి. ఇదంతా జరిగే పనేనా.? ‘విశ్వరూపం’ మర్చిపోయి ‘విశ్వరూపం 2’ చూస్తే మాత్రం ప్రేక్షకుడికి గందరగోళమే ఎదురవుతుంది. ఆ పాత్రలు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో, ఎందుకలా మాట్లాడుతున్నాయో, కథలో ఆ పాత్రకున్న ప్రాధాన్యం ఏమిటో అర్థం కాదు. ఓ పుస్తకాన్ని రెండో భాగం నుంచి చదివితే ఎంత అయోమయంగా ఉంటుందో.. ఇప్పుడు `విశ్వరూపం 2` చూసినా అంతే. దీనంతటికీ ప్రధాన కారణం.. రెండో భాగం విడుదల కావడంలో జరిగిన జాప్యమే. బాహుబలి విడుదలైన యేడాదికి రెండో భాగం వచ్చేసింది. ఈలోగా ‘బాహుబలి 1’ మాటీవీలో చాలాసార్లు ప్రదర్శనకు నోచుకుంది. ఈ అవకాశం ‘విశ్వరూపం’కి లేకుండా పోయింది. కనీసం ‘విశ్వరూపం 1’ని టీవీలో చూద్దామన్నా దొరకలేదు. దాంతో విశ్వరూపంలో లింకులు పోయాయి. విశ్వరూపం 2లో గత భాగం గురించి చూచాయిగా చెప్పే ప్రయత్నం చేసినా.. అది ప్రేక్షకుడికి ఎక్కకపోవొచ్చు. ఓ కథని రెండు భాగాలుగా తీద్దామనుకునేవాళ్లంతా తెలుసుకోవాల్సిన పాఠమిదే. ‘బాహుబలి’లా ఇన్ టైమ్లో వస్తే తప్ప… ఇవన్నీ వర్కవుట్ కావు.